మానవ జన్మ ఎంతో ఉత్తమం
సాక్షి, బళ్లారి: ఈ చరాచర జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని, మనిషిగా పుట్టిన వారు ప్రేమ, విశ్వాసం, నమ్మకంతో జీవించి దైవ నామస్మరణ చేసి ముందుకు వెళ్లాలని అడవిలింగ స్వామి పేర్కొన్నారు. గురువారం నగరంలోని అఖండ కర్ణాటక వాల్మీకి ఐక్య కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవుడికి పూజ చేయడం, టెంకాయ కొట్టడం, నైవేద్యం సమర్పించడంతోనే సరికాదని, మనసు శుద్ధంగా ఉంచుకొని భగవంతుడిని ఎవరు పూజిస్తారో అలాంటి వారికి ఎల్లప్పుడు దేవుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. అఖండ కర్ణాటక వాల్మీకి ఐక్య కూటమి రాష్ట్ర అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప మాట్లాడుతూ వాల్మీకి సమాజంలో జన్మించిన మహర్షి వాల్మీకి భక్తిశ్రద్ధలతో, నియమనిష్టతో జీవితాన్ని సాగించి వాల్మీకి రామాయణాన్ని రచించి భూమి, ఆకాశం ఉన్నంత వరకు వాల్మీకి పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఇలాంటి సమాజంలో జన్మించిన మనమందరం మంచి నడతతో ముందుకెళ్లి సమాజంలో అందరి దృష్టిని ఆకర్షించాలన్నారు. కలిసి కట్టుగా ఉంటేనే ముందుకు వెళ్లడానికి సాధ్యపడుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. వాల్మీకి సమాజ ప్రముఖులు లక్ష్మణ్ తుమటి, ముద్ద మల్లయ్య, జయరాం, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అడవిలింగ స్వామి


