
దేవీరమ్మ కొండ మార్గంలో అస్థిపంజరం
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవీరమ్మకొండ మార్గంలో మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. కొండ మార్గంలో స్వచ్ఛతా పనులు చేస్తుండగా అస్థిపంజరం బయట పడింది. చిక్కమగళూరు పోలీసులు వెళ్లి పరిశీలించి అస్థిపంజరం మహిళదిగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కాగా ఏటా ఒక్కసారి మాత్రమే దేవీరమ్మ కొండపైకి భక్తులను అనుమతిస్తుంటారు. దీపావళి సందర్భంగా కొండపై దేవీరమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తారు.
మైసూరులో
ప్రజలకు రక్షణ లేదు
మైసూరు : విశ్వవిఖ్యాత సాంస్కృతిక నగరి మైసూరులో ప్రజలకు, పర్యాటకులకు భద్రత కొరవడిందని, అభద్రతాభావంతో జీవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మైసూరు– కొడుగు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. మైసూరుకు ప్రగతిపర, సాంస్కృతిక, చరిత్ర నగరంగా ప్రపంచవ్యాప్తంగా పేరుందన్నారు. కొంతకాలంగా నగరంలో దాడులు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ఉదాసీనతతో ఉందన్నారు. ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌పై ఇటీవల దుండగులు రాళ్ల దాడి చేశారన్నారు. మహారాష్ట్ర పోలీసులు మైసూరులో జరుగుతున్న డ్రగ్స్ దందాను ఛేదించి రూ. 340 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారన్నారు. వస్తు ప్రదర్శన శాల సమీపంలో పట్టపగలే వ్యక్తిని దుండగులు హత్య చేశారన్నారు. గురువారం ఓ చిన్నారిపై దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎన్నికల సమయంలోమాత్రమే మైసూరు నా ఊరు అంటారని, ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్నారు.
స్వాధీనంలో ఉన్నవారికి అటవీ భూ హక్కు
● సీఎం సిద్దరామయ్య
శివాజీనగర: 2005వ సంవత్సరానికి ముందు అటవీ భూమిని సాగు చేస్తున్న వారికి భూమిపై హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఉత్తర కన్నడ జిల్లా అటవీ భూమి సాగుదారుల పోరాట కమిటీ అధ్యక్షుడు కే.చంద్రకాంత్, జీ.ఎం.శెట్టి, పీ.టీ.నాయక్, గణేశ్ నాయక్ నేతృత్వంలో పోరాట సమితి బృందం గురువారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమక్షంలో ముఖ్యమంత్రిని కలిసి అటవీ హక్కు వినతిపత్రాలను తిరస్కరించిన కారణంగా ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో సీఎం సిద్దరామయ్య అటవీ హక్కు చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు. అర్హులు భూ హక్కు నుంచి వంచితులు కాకుండా జిల్లా యంత్రాంగానికి సూచిస్తామని భరోసానిచ్చారు. అటవీ భూమిలోని బగర్ హుకుం సాగుబడికి సంబంఽధించి అటవీ భూ సంరక్షణా చట్టం–1980 కింద పునర్ సమీక్ష జరపటంతో పాటు అటవీ హక్కు చట్టం తప్పనిసరిగా అమలు పరచటం ద్వారా జిల్లాలో ప్రజలకు భూ హక్కు ఇప్పించాలని బృందం ముఖ్యమంత్రిని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం తప్పకుండా అమలు పరిచేందుకు ప్రభుత్వం వద్ద వివిధ రకాల సలహాలను తమ పోరాట కమిటీ ప్రభుత్వం ముందు ఉంచిందని చంద్రకాంత్ తెలిపారు. బృందంతో మాట్లాడిన సిద్దరామయ్య అటవీ భూమి సాగుదారుల హితరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వసతి జీవనోపాధికి అటవీ భూమిని అవలంభించిన పేద ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి మంకాళ వైద్య పాల్గొని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.