
కుటుంబ కలహాలకు ముగ్గురు బలి
యశవంతపుర: కుటుంబ కలహాలు ముగ్గురిని బలితీసుకున్నాయి. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బాగలకుంటె సమీపంలోని భువనేశ్వరినగరలో విజయలక్ష్మి, రమేష్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె బృందా(4), ఏడాదిన్నర వయసున్న భువన్ అనే కుమారుడు ఉన్నాడు. రమేశ్ నగరంలోని ఒక మాల్‌లో పనిచేస్తున్నాడు. కాగా రమేష్ ఒక మహిళను ప్రేమించి రెండోపెళ్లి చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈక్రమంలో విడాకులు ఇవ్వాలని రమేష్ తరచూ భార్య విజయలక్ష్మితో గొడవ పడుతున్నాడని, దీంతో దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతోందని స్థానికులు అంటున్నారు. పలు పర్యాయాలు విజయలక్ష్మి తన గోడును తల్లిదండ్రుల వద్ద చెప్పి విలపించేది. అయితే తల్లిదండ్రులు సర్దిచెప్పి పంపేవారు. మరో వైపు రమేష్ వేధింపులు అధికం కావడంతో గురువారం తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసి తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు సాయంత్రం విజయలక్ష్మి చెల్లలు తన అక్క ఇంటికి వెళ్లగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాగులకుంటె పోలీసులు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకొని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
భర్త విడాకులు కోరడంతోనే అఘాయిత్యం