
విమానాశ్రయ పనుల పూర్తికి సూచన
రాయచూరు రూరల్: రాయచూరు విమానాశ్రయం మరమ్మతు పనులను జిల్లాధికారి నితీష్ పరిశీలించారు. శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. త్వరిత గతిన పనులను పూర్తి చేయాలని సూచించారు. రన్‌వే, సీఆర్‌ఎఫ్, ఏటీసీ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. 70 శాతం రక్షణ గోడలు పూర్తి కాగా, ప్యాసింజర్ టర్మినల్, 2.5 కి.మీ.దూరం రన్‌వే పనులు పూర్తి చేయాలన్నారు. నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, అధికారులు వెంకటేష్, ప్రవీణ్‌లున్నారు.
మౌలానా ఆజాద్ సేవలు అమోఘం
రాయచూరు రూరల్ : భారత దేశంలో విద్యా రంగాభివృద్ధికి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు అమోఘమని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ అభిప్రాయ పడ్డారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్యం, పరిసరాల శుభ్రత, సంరక్షణ అంశాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వసంత్ కుమార్, నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, శాలం, మౌలానా ఫరీద్ ఖాన్, అస్లాంపాషా, అబ్దుల్ కరీం, బషీరుద్దీన్, రవికుమార్, ఇక్బాల్, షేక్ ఫజులుల్లాలున్నారు.
రాజీ ప్రక్రియతో కేసుల సత్వర పరిష్కారం
రాయచూరు రూరల్: జిల్లాలోని కోర్టుల్లో ఇబ్బడి ముబ్బడిగా పేరుకు పోయిన పాత కేసులను రాజీ ప్రక్రియ విధానం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తులు మారుతి బగాదే, స్వాతిక్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడారు. సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి వీలు కల్పించారన్నారు. జిల్లాలో 5000 కేసులకు గాను 2500 కేసుల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. రూ.25 లక్షల మేర డబ్బులను చెల్లించారన్నారు.