
సముదాయ భవన నిర్మాణానికి రూ.25 లక్షలు
బళ్లారిఅర్బన్: తమకు సముదాయ భవనం నిర్మించి ఇవ్వాలని మోతీ సమాజం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నందుకు తాను స్పందించి రూ.25 లక్షల నిధులను త్వరలోనే మంజూరు చేస్తానని నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి హామీ ఇచ్చారు. రూపనగుడి రోడ్డు మణికంఠ కాలనీలో శ్రీశాంభవి దేవస్థాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానాన్ని స్వీకరించి ఆయన మాట్లాడారు. ఏ సమాజం అయినా వారి జనాభా మేరకు డిమాండ్లను నెరవేర్చడం తన ప్రథమ కర్తవ్యం అని అన్నారు. ఓ సమాజంలో ఒక్క వ్యక్తి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయనని హామీ ఇచ్చారు. అన్ని సమాజాలను కలుపుకొని పోవాలన్నదే తన ఆశయం అన్నారు. ఆ మేరకు అన్ని కులాలు, మతాల ఎదుగుదలకు శ్రమిస్తానన్నారు. ఇందులో ఓటు బ్యాంక్ రాజకీయాలు అసలు లేవన్నారు. ఇతర డిమాండ్లు ఉన్నా కూడా తన దృష్టికి తేవాలన్నారు. మొత్తానికి మోతీ సంఘం అభివృద్ధి కావాలి. ఆ సమాజం యువకులు మంచి విద్యను పొంది ఉన్నత ఉద్యోగాలకు చేరుకోవాలన్నారు. తాను ఎల్లప్పుడూ మీకు అండదండగా ఉంటానని ఆయన మరోసారి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేత హొన్నప్పతో పాటు ఆ సమాజం నేతలు కార్పొరేటర్ గుడిగంటి హనుమంతు, నూర్ మహమ్మద్, మించు శీన, కాంగ్రెస్ నేతలు చానాళ్ శేఖర్, హగరి గోవింద, రాము, దేవన్న పాల్గొన్నారు.