
జోరుగా ఖరీఫ్ వ్యవసాయ పనులు
సాక్షి,బళ్లారి: ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు జోరుగా కురవడంతో పాటు తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తుంగభద్ర డ్యాంకు అనుకున్న సమయం కన్నా ముందుగా నిండిపోయి, కాలువలకు నీరు కూడా సకాలంలో వదలడంతో పాటు గేట్లు కూడా ఎత్తివేయడంతో డ్యాంలో నిండుకుండలా తొణికిసలాడుతోంది. టీబీ డ్యాం పరిధిలోని హెచ్‌ఎల్‌సీ, ఎల్‌సీఎల్‌సీ, ఎల్‌బీఎంసీ తదితర కాలువలకు పూర్తిస్థాయిలో నీరు వదలడంతో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేసేందుకు రైతులు ఉత్సాహంగా ఆయకట్టు పరిధిలో వ్యవసాయ పనుల్లో జోరుగా నిమగ్నమై ఉన్నారు. ప్రధాన కాలువల నుంచి డిస్ట్రిబ్యూటరీలకు, చిన్న కాలువలకు నేరుగా రైతుల పొలాల్లోకి నీరు చేరుతున్నాయి. దీంతో ట్రాక్టర్లతో బురద మడి పనులు, ఎద్దులతో కూడా వ్యవసాయ పనులు విస్తృతంగా సాగుతున్నాయి. ఖరీఫ్‌లో వరినాట్లు, మిర్చిసాగు చేయడంపై రైతులు ఆసక్తి చూపుతూ ఆ దిశగా ముందుగా దుక్కులు దున్నిన రైతులు నాట్లు వేసే ప్రక్రియకు సిద్ధం అవుతున్నారు.
బోరుబావుల కింద వరి నారు విక్రయం
బోరు బావుల సదుపాయం ఉన్న రైతులు వరినారు పోసుకుని, వరినాట్లు వేసుకున్న రైతులు వరినారు విక్రయిస్తున్నారు. ఒక ఎకరానికి వరినాట్లు వేయడానికి రూ.3500లు వరినారుకు ఖర్చు చేస్తుండగా, దుక్కులు దున్నడానికి, నాట్లు వేయడానికి కూడా మరో రూ.10 వేలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
ఖరీఫ్ నాట్లకు సిద్ధంగా వరినారు
మేలైన వరినారును రైతులు పొలాల్లో సిద్ధం చేసుకున్నారు. వరినాట్లు వేసుకునే రైతులకు నారు కొరత లేకుండా సిద్ధంగా ఉందన్నారు. వరినాట్లు వేయడానికి దుక్కులు ఓ వైపు జోరుగా సాగుతుండగా, మరో వైపు మిర్చి నాటేందుకు కూడా పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. మిర్చి నారుకు కూడా మంచి డిమాండ్ ఉందన్నారు. పొరుగున అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం తదితర ప్రాంత్లాల్లో మిర్చి పైరు సాగుకు సిద్ధం చేసుకుంటున్నారని, అక్కడ అనువైన వాతావరణం ఉండటంతో మిర్చినారును ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నామని మిర్చిసాగు చేసే రైతులు పేర్కొంటున్నారు. కాగా ఆయకట్టు రైతులు జోరుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నం కాగా, వర్షాధారిత మెట్ట ప్రాంతాలు ఉన్న రైతులు నిరుత్సాహంతో అంతంత మాత్రంగా వ్యవసాయ పనులు చేస్తున్నారు. మేఘాలు ఊరిస్తున్నప్పటికీ బలమైన వర్షాలు కురవకపోవడంతో మెట్ట ప్రాంతాల్లో జోరుగా విత్తన సాగు ప్రక్రియ జరగడం లేదని, అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో విత్తన సాగుపై రైతులు భయంభయంగా ముందుకు కదులుతున్నారు. జిల్లాలో తుంగభద్ర ఆయకట్టు కింద బళ్లారి, కంప్లి, కురుగోడు, సిరుగుప్ప తాలూకాల్లో విస్తృతంగా సాగు జరుగుతుండగా, వర్షాధారితంగా జిల్లాలో సండూరు, బళ్లారి తాలూకాల్లో ప్రధానంగా సాగు జరుగుతోంది. ఈనేపథ్యంలో వర్షాధారిత భూముల్లో భారీ వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 40 శాతం కూడా విత్తన ప్రక్రియ సాగలేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
ఆయకట్టులో వరినాట్లకు సిద్ధం చేసుకుంటున్న రైతులు
ముందుగా వరినారు పోసుకున్న రైతులకు డిమాండ్
ఒక ఎకరా వరి నాటేందుకు నారు ధర రూ.3500 పైమాటే
మరో 15 రోజుల్లో వరినాట్లు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు
ఖుషీగా ఆయకట్టు రైతులు, మెట్ట ప్రాంత రైతులు డీలా
వర్షాధార భూముల్లో నత్తనడకన సాగుతున్న విత్తన ప్రక్రియ

జోరుగా ఖరీఫ్ వ్యవసాయ పనులు