
రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు?
సాక్షి,బళ్లారి: రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ తలెత్తుతుందని, సీఎం కుర్చీ కోసం కుమ్ములాట సాగుతోందని మాజీ మంత్రి శ్రీరాములు ఆరోపించారు. ఆయన గురువారం నగరంలోని తన నివాసగృహంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో సీఎం సిద్ధరామయ్య కీలుబొమ్మలా అని, కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సుర్జేవాలా సర్వాధికార ధోరణి అవలంభిస్తున్నారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులతో ప్రత్యేక సమావేశాలు కావడం సీఎం తరహాలో వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్యా? కాదా? అని అనుమానం కలుగుతోందన్నారు.
బళ్లారిలో డ్రగ్స్ మాఫియా
బళ్లారిలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోతోందన్నారు. కళాశాల విద్యార్థులకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వాపోయారు. చిన్న ఖర్గే శిష్యుడు లింగరాజు డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కున్నారని, జిల్లాలో మట్కా, పేకాట పెట్రేగి పోతోందని, విచ్చలవిడిగా జరుగుతున్నా పాలకులకు నియంత్రించాలనే ఆలోచన లేదన్నారు. బళ్లారి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తి చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా జమీర్ అహమ్మద్ ఉన్నాడో? లేదో? అర్థం కావడం లేదన్నారు. తుంగభద్ర డ్యాంలో 19వ క్రస్ట్‌గేటు గత ఏడాది కొట్టుపోయిన నేపథ్యంలో మిగిలిన గేట్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని నిపుణులు సూచించినా ఎందుకు మరమ్మతు చేయలేదు? అని ప్రశ్నించారు. మాజీ మేయర్, పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు, కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, హనుమంతు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్‌లో కుమ్ములాట
సర్కార్‌పై మాజీ మంత్రి శ్రీరాములు గరం