
కారుపై కూలిన చెట్టు
కృష్ణరాజపురం: చలిస్తున్న కారుపై భారీ వృక్షం పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. వివరాలు.. శుక్రవారం సాయంత్రం బెంగళూరు శేషాద్రిపురం లా కాలేజీ వద్ద ఉన్న పెద్ద చెట్టు హఠాత్తుగా కూలిపోయింది. రోడ్డు మీద వెళ్తున్న కారు మీద పడిపోయింది. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు, డ్రైవర్ కూడా సురక్షితంగా తప్పించుకున్నాడు. అలాగే చెట్టు కొమ్మలు తగిలి 3 విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో గంటలకొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.
20న బోనాల జాతర
బొమ్మనహళ్లి: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల వేడుకలు బెంగళూరు నగరంలో జూలై 20వ తేదీన జరగనున్నాయి. తెలంగాణవాసులతో పాటు తెలుగు ప్రజలు అందరూ పాల్గొనాలని కర్ణాటక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సంస్థ సభ్యులు తెలిపారు. బెంగళూరు కళ్యాణ నగరలో ఉన్న ఓంశక్తి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు జరుగుతాయని చెప్పారు.
పసికందును అమ్మేసిన తండ్రి
● అప్పులు తీర్చడానికి అకృత్యం
యశవంతపుర: మైక్రో ఫైనాన్స్‌లో సహా పలు చోట్ల చేసిన అప్పులు తీర్చడానికి ఓ తండ్రి 20 రోజుల బిడ్డను అమ్మిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా దాండేలి తాలూకా దేశపాండే నగరలో జరిగింది. శిశువును రూ. 3 లక్షలకు అమ్మారు. వివరాలు.. జూన్ 17న వసీం చందు పటేల్ భార్య మోహీన్ దాండేలి ప్రభుత్వ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. వసీం అనేక చోట్ల అప్పులు చేశాడు. తీర్చాలని ఒత్తిడి అధికమైంది. అప్పులు తీర్చే శక్తి లేని వసీంకు కిరాతకమైన ఆలోచన వచ్చింది. భార్యకు తెలియకుండా శిశువును అమ్మకానికి పెట్టాడు. బెళగావి జిల్లా అనగోళకు చెందిన నూరు మహమ్మద్ అబ్దుల్ మజీద్ (47), కిశన్ ఐరేకర్ (42) అనేవారు శిశువును కొనుగోలు చేశారు. కొడుకు కనిపించకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి అంగనవాడి కార్యకర్తకు చెప్పగా, ఆమె దాండేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో శిశువును తండ్రే అమ్మినట్లు తేలింది. కొనుగోలుచేసిన వారి కోసం గాలిస్తున్నారు.
భార్య ముక్కును కొరికేశాడు
దొడ్డబళ్లాపురం: అప్పు కంతు కట్టలేదనే కోపంతో భర్త, భార్య ముక్కును కొరికేసిన వింత సంఘటన దావణగెరెలో వద్ద జరిగింది. జిల్లాలో చన్నగిరి తాలూకా మంటరగట్టలో విజయ్, భార్య విద్య జీవిస్తున్నారు. వీరు ధర్మస్థలం స్వసహాయ సంఘంలో రూ.2 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే విద్య సరిగా కంతులు కట్టడం లేదని భర్త గొడవపడ్డారు. కోపం పట్టలేక ఆమె ముక్కును కొరికివేశాడు. దీంతో ముక్కు కొంతభాగం తెగిపోయింది. ఇరుగుపొరుగు విద్యను ఆస్పత్రికి తరలించారు, ఆమె చికిత్స పొందుతోంది. చన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కారుపై కూలిన చెట్టు

కారుపై కూలిన చెట్టు