
ఘర్షణ కేసులో 20 మంది అరెస్ట్
హుబ్లీ: మంటూరు రోడ్డు అరళికట్టె వీధిలో రెండు గుంపుల మధ్య జరిగిన ఘర్షణపై మూడు ప్రత్యేక కేసులను నమోదు చేసుకొని 20 మందిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. జిలాని, జాధవ్‌ల మధ్య పరస్పరం మాటా మాటా పెంచుకున్న ఫలితంగా సెటిల్‌మెంట్, మంటూరు రోడ్డులకు చెందిన రెండు గుంపులు కత్తులు, హాకీ స్టిక్‌లు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో మంజునాథ, రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేశాయి. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బందిపై కూడా దాడి చేశారు. పోలీసులు విధులను అడ్డుకున్న ఆరోపణలపై కూడా వీరిపై కేసు దాఖలైంది. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి వివరాలను సేకరించాం. కేసులో రౌడీషీటర్లు కూడా పాలు పంచుకున్నారు. త్వరలో వారిపై కూడా గూండా చట్టంతో పాటు సరిహద్దుల నుంచి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు. ఈ కేసులకు సంబంధించి గణేష్, శుభం, పవన్, వినాయక, గౌతమ్, అశ్వథ్, రాఘవేంద్ర, విశాల్ తదితర 20 మందిని అరెస్ట్ చేశామన్నారు.
చిన్న కారణానికి గొడవ.. యువకుడికి కత్తిపోటు
హుబ్లీ: ధార్వాడలో హావేరి పేట కంటి గల్లిలో చిన్న కారణంతో ఓ యువకుడిపై కత్తితో పొడిచిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ వీధికి చెందిన మల్లిక్‌కు రాఘవేంద్ర వెన్నెముకపై చాకుతో పొడిచాడు. ఈ క్రమంలో చాకులోని చివరి భాగం వెన్నులో విరిగి మిగిలి పోయింది. తక్షణమే రాఘవేంద్రను చికిత్స కోసం హుబ్లీ కిమ్స్‌కు తరలించారు. నిందితుడు మల్లిక్ పరారయ్యాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ధార్వాడ ఉపనగర పోలీసులు తెలిపారు. అంతేగాక రాఘవేంద్ర ఇంటికి వెళ్లిన కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ రాఘవేంద్ర, మల్లిక్ ఇద్దరు స్నేహితులు. కట్టడ కార్మికులుగా పని చేసే వారు. మల్లిక్ రాఘవేంద్ర సోదరుడికి డబ్బులు ఇచ్చాడు. ఈ విషయమై వారి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. శుక్రవారం మల్లిక్ ఇంటికి వచ్చిన వేళ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఉండలేదు. దీంతో రాఘవేంద్ర, మల్లిక్ మధ్య మాటామాటా పెరిగిన పర్యవసానంగా మల్లిక్ రాఘవేంద్ర వెన్ను భాగంలో పొడిచి పరారయ్యాడని, నిందితులు ఒక్కరా, ఇద్దరా అనేది దర్యాప్తులో తేలుస్తామని పోలీసులు తెలిపారు.
నగరసభ అధ్యక్షురాలికి కాంగ్రెస్ మోసం
రాయచూరు రూరల్: రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఆధారంగా అధ్యక్షురాలైన నగరసభ అధ్యక్షురాలు నరసమ్మకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాదిగ రిజర్వేషన్ పోరాట ఐక్య వేదిక అధ్యక్షుడు విరుపాక్షి ఆరోపించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్షురాలు నరసమ్మతో లేఖ రాయించుకున్నట్లు తెలిపారు. అనారోగ్యం కారణంగా నగరసభ ఇంచార్జి అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ గురువారం నగరసభ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టడం తగదన్నారు. ఏడాది క్రితం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నరసమ్మ స్థానంలో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సాజిద్ సమీర్ మూడు నెలల కోసం అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అధిష్టానం ఆదేశించడాన్ని ఖండించారు. మూడు నెలల్లో నగరసభ ఎన్నికలు రానుండడంతో అధ్యక్ష పదవిని మైనార్టీలకు కేటాయించామని చెప్పుకొని ఓట్లను రాబట్టడానికి ఈ పని చేశారని విమర్శించారు. అధ్యక్షురాలు నరసమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, మంత్రి బోసురాజు మాదిగలకు, మైనార్టీలకు మోసం చేశారని, తిరిగి నరసమ్మకు అధ్యక్ష పదవిని అప్పగించాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తామన్నారు.
యల్లమ్మ సన్నిధిలో వ్యక్తిపై దాడి
హుబ్లీ: బెళగావి జిల్లా సవదత్తి తాలూకాలోని రేణుకా యల్లమ్మ ఆలయంలో శ్రీరామ సేన జిల్లాధ్యక్షుడిపై మారణాయుధాలతో దాడి చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సదరు సేన జిల్లాధ్యక్షుడిపై మారణాయుధాలతో దాడి చేసినట్లు సవదత్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ధార్వాడ జిల్లాధ్యక్షుడు అణ్ణప్పపై ఈ దాడి జరిగింది. అణ్ణప్ప తన భార్య, పిల్లలతో ఆలయానికి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా అణ్ణప్ప భార్య తన బిడ్డకు ప్రసాదం తినిపిస్తుండగా దేవాలయంలో బయట తిండి పదార్థాలు తినిపించరాదని హోంగార్డు సిబ్బంది ఆమెకు సూచించారు. దీంతో ఆమె బయటకు వచ్చి బిడ్డకు తిండి పదార్థాలు తినిపించారు. దీంతో పోలీస్ సిబ్బంది అసభ్యంగా తిట్టగా దీన్ని ప్రశ్నించిన అణ్ణప్పపై తీవ్రంగా దాడి చేసినట్లు సవదత్తి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
దుకాణాలపై అధికారుల దాడులు
● విషపూరిత పదార్థాల స్వాధీనం
రాయచూరు రూరల్: విషపూరితమైన పదార్థాలను విక్రయిస్తున్న దుకాణాలపై ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు జరిపారు. శుక్రవారం మాన్విలోని ఇస్లాంపురలో ఖాళీ స్థలంలో ఉంచిన ప్రాణ హానికారకమైన విషంతో కూడిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతర, దర్గా, ఉరుసు ఇతర ఉత్సవాల్లో మసాలా వంటి పదార్థాల్లో విష పదార్థాలను కలుషితం చేసి లడ్డూ, కారాలు ఇతర పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తీయడానికి ప్రయత్నం చేస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. 967 కేజీల మిశ్రిత మసాలా పౌడర్, 152 కేజీల ఎర్ర బ్యాళ్లు, 220 కేజీల పసుపు, రంగు రంగుల బ్యాళ్లు, బొప్పాయి విత్తనాలు, చెక్క, కొబ్బరి పుడి, 842 కేజీల కలుషిత ఆహార పదార్థాలను సీజ్ చేసి వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్ ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.