
మౌలిక సౌకర్యాల కోసం ఆందోళన
బళ్లారిఅర్బన్: కోళూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు, తాగునీరు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులు ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో ఆ జీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ సంస్థ జిల్లాధ్యక్షుడు కే.ఈరణ్ణ మాట్లాడుతూ కోళూరు ప్రభుత్వ పాఠశాలలో 5 నుంచి 8వ తరగతి వరకు 200 మందికి పైగా పేద రైతుల పిల్లలైన విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలకు ప్రభుత్వ స్థలంలో సొంత భవనం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరుగుదొడ్లు లేనందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఆ పాఠశాల పక్కన ఉన్న స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించాలి. భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా రక్షిత తాగునీరు, మరుగుదొడ్ల వ్యవస్థ కల్పించాలని సీఆర్‌పీ అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. దీనిపై సీఆర్‌పీ అధికారులు స్పందిస్తూ మూడు నెలల్లో పాఠశాలకు సొంత భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పీడీఓ కూడా తాగునీటి వసతితో పాటు 15 రోజుల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. సంస్థ వైస్ చైర్ పర్సన్ ఎం.శాంతి, జిల్లా కార్యదర్శి కంబళ్లి మంజునాథ్, గ్రామ ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.