
భార్యతో స్నేహితుడి అక్రమ సంబంధం
● నరికి చంపిన భర్త
సాక్షి బళ్లారి/ హొసపేటె: స్నేహం ముసుగులో భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని కొడవలితో నరికి చంపిన భర్త ఉదంతం గంగావతిలో జరిగింది. గంగావతి తాలూకా విఠలాపురానికి చెందిన నాగరాజ్(28), హనుమంతప్ప చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఏడేళ్ల క్రితం హనుమంతప్పకు వివాహమైంది. నాగరాజు అప్పుడప్పుడు వస్తూపోతూ హనుమంతప్ప భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం పసిగట్టిన హనుమంతప్ప స్నేహితుడితో గొడవ పడి, పంచాయతీ చేసి పోలీసు స్టేషన్ కూడా వెళ్లాడు. స్నేహితుడిలో మార్పు రాక పోవడంతో శనివారం సాయంత్రం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని రైస్ మిల్లు వద్దకు నాగరాజును పిలిపించాడు. అనంతరం అతన్ని కొడవలితో నరికి, తలపై బండరాయి వేసి హత్య చేశాడు. అనంతరం కనకగిరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన విఠలాపురంలో కలకలం రేపింది.