బెళగావి నీళ్లు ధార్వాడకా?
● కన్నడ సంఘాల ధర్నా
దొడ్డబళ్లాపురం: జిల్లాలోని హిడకల్ డ్యాం నుంచి హుబ్లీ–ధార్వాడలోని పరిశ్రమలకు నీటి విడుదలను ఆపకపోతే బెళగావి బంద్ తప్పదని కర్ణాటక రక్షణ వేదిక నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు. సోమవారంనాడు బెళగావిలోని రాణి చెన్నమ్మ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ఖాళీ బిందెలతో ర్యాలీ చేసి, కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. వారంలోపు నీటి విడుదల ఆపకపోతే తామే ముందుండి నీటి విడుదల అడ్డుకుంటామని, బెళగావి జిల్లా బంద్ చేస్తామని చెప్పారు. జిల్లాలోని హిడకల్ డ్యాం నుంచి ప్రజలకు, రైతులకు నీటిని ఇవ్వాలని కోరారు. పరిశ్రమలకు ఇస్తే రైతుల పంటలు ఎండిపోతాయన్నారు. కలెక్టర్ కార్యాలయానికి తాళం వేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేసి తరలించారు.
మెడికో ఆత్మహత్య
శివమొగ్గ: శివమొగ్గలో ఉన్న సుబ్బయ్య మెడికల్ కళాశాలలో హాస్టల్లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు విష్ణుప్రియ (22). వివరాలు.. ఈమె కుటుంబం బెంగళూరుకు చెందినది కాగా, జర్మనీలోని బెర్లిన్‌లో నివసిస్తోంది. విష్ణుప్రియ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇంటర్న్‌షిప్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లో పూర్తయి డాక్టర్ కానుంది. అయితే ఏమి జరిగిందో మరి.. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కారణాలు తెలిసి రాలేదు. డెత్‌నోట్ ఏదీ దొరకలేదు. శివమొగ్గ గ్రామీణ పోలీసులు ఆమె శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మిమ్స్‌లో బాలిక మృతిపై విచారణ
మండ్య: బాలిక సాన్వి మరణానికి మిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం కారణమని ఆరోపణలు రావడంతో విచారణ కోసం బృందాన్ని ఏర్పాటు చేశాం, 15 రోజుల్లోగా నివేదిక ఇస్తారని ఎమ్మెల్యే పి.రవికుమార్ చెప్పారు. సోమవారం మండ్య నగరంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఇంట్లో టైల్స్ పడడం వల్ల బాలిక కాలు విరిగింది, నాలుగు రోజుల్లో ఎలా చనిపోతుందని అన్నారు. గాయానికి ఇన్‌ఫెక్షన్ వచ్చిందని వైద్యులు తెలిపారన్నారు. మిమ్స్‌లోని పలు విభాగాల సర్జన్లతో కమిటీని రచించినట్లు తెలిపారు. జిల్లాధికారి కార్యాలయంలో మిమ్స్ వైద్య నిపుణులతో కలెక్టర్ చర్చించారు. బాలికను వైద్యం కోసం చేర్పించగా మరణించడం, మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేయడం తెలిసిందే. సకాలంలో వైద్యం చేయకపోవడం వల్లే తమ బిడ్డ దూరమైందని తల్లిదండ్రులు ఆరోపించారు.
అరెస్టు చేయాలని ధర్నా
బనశంకరి: బెళగావి తాలూకా సంతిబస్తవాడ మసీదులో ఖురాన్, హదీస్‌లను కాల్చివేసిన ఘటనలో దుండగులను అరెస్టు చేయాలని ముస్లింలు సోమవారం ఆ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఘటన జరిగి 20 రోజులు గడిచినప్పటికీ దుండగులను అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు కారణమౌతోందని, గ్రామంలో అశాంతి సృష్టించడానికి దుండగులు కుట్రపన్నారని ఆరోపించారు. ఇటీవల సంతిబస్తవాడలో మరో వర్గంవారు తమతో వ్యాపారాలను బహిష్కరించారని, మత సామరస్యం దెబ్బతీస్తున్నారని చెప్పారు. చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.
బెళగావి నీళ్లు ధార్వాడకా?
బెళగావి నీళ్లు ధార్వాడకా?
బెళగావి నీళ్లు ధార్వాడకా?


