కన్నడలోనే రైల్వే పోటీ పరీక్షలు
● కేంద్ర మంత్రి సోమణ్ణ
కోలారు: నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి దరఖాస్తు చేసుకోలేదు. ఆ పదవి గురించి హైకమాండ్ చూసుకుంటుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ అన్నారు. ఆదివారం కోలారులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికలలో సిద్దరామయ్యపై పోటీ చేయాలని హైకమాండ్ ఆదేశిస్తే, పాటించాను. తరువాత లోక్‌సభ ఎన్నికలలో తుమకూరు నుంచి పోటీ చేయాలని చెబితే పోటీ చేసి గెలిచాను అని చెప్పారు. రైల్వే ఉద్యోగ పరీక్షలను కన్నడంలోనే రాయడానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారన్నారు. దీనివల్ల కన్నడిగులకు ఉపయోగం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విద్వేష ప్రసంగాల నిరోధక చట్టం గురించి స్పందిస్తూ సంస్కారం, సంస్కృతి తెలియని వారే ఇదంతా చేస్తారన్నారు. 12 లక్షల రైల్వే ఉద్యోగులు ఉన్నారు. ఇంతవరకు చిన్న ధర్నా కూడా చేయలేదు. రైల్వే ఉద్యోగులకు అన్ని సౌలభ్యాలు అందిస్తున్నామన్నారు. సీఎం సిద్దరామయ్య కుర్చీని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. ప్రచారానికి చేసిన ఖర్చును అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించి ఉంటే ఎంతో ప్రగతి సాధ్యమయ్యేదన్నారు. రాష్ట్ర బీజేపీ లో ఎలాంటి అసమ్మతి లేదన్నారు.
త్వరలో గృహలక్ష్మి సొమ్ము జమ: మంత్రి
శివాజీనగర: రాష్ట్రంలో గృహలక్ష్మీ లబ్ధిదారులు వేచి చూస్తున్న పథకం సొమ్ము విడుదల గురించి మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తీయని కబురు అందించారు. 3 నెలలుగా సొమ్ము పడలేదని ప్రతిపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఆదివారం బెళగావిలో మాట్లాడిన ఆమె సోమవారం నుంచి శనివారం లోగా 24వ కంతు సొమ్ము మహిళల ఖాతాల్లోకి జమ అవుతుందని చెప్పారు. ఆర్థికశాఖ నుంచి శనివారంలోగా సొమ్ము విడుదల కానుందని భరోసానిచ్చారు. మరణించిన మహిళల ఖాతాలకూ సొమ్ము పడుతోందని విలేకరులు ప్రస్తావించగా, ఈ విషయమై సీఎస్ నేతృత్వంలో 2 సార్లు సమావేశం జరిపారు. సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరిచాం. మరణ ధృవీకరణ పత్రాలను అంగనవాడి కార్యకర్తలు పరిశీలిస్తారు. డబ్బులను ఖాతాల నుంచి వెనక్కి తీసుకునే బాధ్యతను బ్యాంకులకు ఇచ్చినట్లు తెలిపారు.
ఆన్‌లైన్ మిత్రుని వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
యశవంతపుర: ఆర్థిక సాయం చేసినందుకు ప్రతిఫలంగా కోరిక తీర్చాలని వేధించడంతో మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన బెంగళూరు రాజగోపాలనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఇటీవల ఆమె ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి కూతురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరింది. మహిళ ఆన్‌లైన్ స్నేహితుడైన పారితోష్ యాదవ్ అనే వ్యక్తిని ఆర్థిక సాయం అడిగింది. అతడు కొంచెం డబ్బులు ఇచ్చాడు. కొన్నిరోజులుగా అతడు బాకీ తీర్చవద్దు, పడకగదికి వస్తే చాలని ఒత్తిడి చేయసాగాడు. ఇలాంటి పనులు చేయనని ఆమె చెప్పేసింది. ఈ గొడవ భర్తకు తెలియటంతో సంసారంలో చిచ్చు రేగింది. అంతటితో వదలకుండా ఆమె మొబైల్‌ఫోన్‌కు అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపడం ప్రారంభించారు. దీంతో మహిళ దిక్కుతోచక ఆత్మహత్యకు యత్నించగా, ప్రాణాలతో బయటపడింది. పోలీసులు ఆమెను విచారించగా యాదవ్ నిర్వాకాన్ని వివరించింది. అతనిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
రెండు చుక్కలు..
ఆరోగ్యానికి అస్త్రాలు
● చురుగ్గా పోలియో మందు పంపిణీ
శివాజీనగర: రాష్ట్రమంతటా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే పల్స్ పోలియో చుక్కల పంపిణీ ఆరంభమైంది. బెంగళూరులో సీఎం సిద్దరామయ్య నివాస కార్యాలయం కృష్ణాలో శిశువులకు చుక్కలు వేశారు. 5 సంవత్సరాలోపు ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా సమీపంలో పల్స్ పోలియో కేంద్రంలో చుక్కలు మందును వేయించాలని సీఎం సూచించారు. ఈ చుక్కలే భవిష్యత్ అంగవైకల్యాన్ని అడ్డుకుంటాయన్నారు. రాష్ట్రంలో 62.40 లక్షల మంది పిల్లలకు చుక్కలు వేస్తారు. అన్ని ఆసుపత్రులు, అంగనవాడీలు, ఆరోగ్య కేంద్రాలు, అలాగే ఆరోగ్య కార్యకర్తలు కర్మాగారాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు వెళ్లి చుక్కలను పంపిణీ చేస్తారు.
సోమవారం నుంచి ఆరోగ్య కార్యకర్తలు సంచరిస్తూ మందును ఇస్తారు. రాష్ట్రమంతటా 33,258 బూత్‌లు, 1,030 సంచార బృందాలు, 1096 ట్రాన్సిట్ బృందాలు, 1,13,115 మంది పల్స్ పోలియో కార్యకర్తలు, 7,322 సూపర్‌వైజర్‌లను ఈ కార్యక్రమానికి నియమించారు.


