విద్యారత్న, సేవా భూషణ అవార్డుల ప్రదానం
కోలారు : నగరంలోని సువర్ణ కన్నడ భవనంలో ఆదివారం పాఠశాల విద్యాశాఖ, ఉద్యోగుల సంఘం ప్రథమ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఆరు తాలూకాల్లోని 24 మంది ఉపాధ్యాయులకు విద్యారత్న, ఆరు మంది బోధనేతర సిబ్బందికి సేవాభూషణ అవార్డులను అందించారు. కార్యక్రమాన్ని ముళబాగిలు బీఈఓ రామచంద్ర ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు వృత్తి పావిత్య్రతను కాపాడాలన్నారు. సంఘం పదాధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి పరిషత్ సభ్యుల ద్వారా సమాలోచన చేసి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోలారు జిల్లా నౌకర్ల సంఘం అధ్యక్షుడు అజయకుమార్, గౌరవాధ్యక్షుడు మంజునాథ్, జిల్లా ఉన్నత పాఠశాల సహ శిక్షకుల సంఘం అధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.


