
దేశ రక్షణే మనకు ముఖ్యం
సాక్షి,బళ్లారి: దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారని, భారత్‌పై దాడులకు తెగబడిన వారి అంతు చూడాల్సిందేనని, పాకిస్తాన్‌తో యుద్దం వద్దని తాను ఎప్పుడూ అనలేదని, తన మాటలను వక్రీకరించారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలో గిణిగేరాలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో యావత్ భారతదేశం ఒకటిగా నిలిచిందన్నారు. యుద్ధానికి తాము పూర్తిగా మద్దతు ఇచ్చామన్నారు. పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారన్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవడంలో మన సైనికుల త్యాగాలు మరవలేనివన్నారు.
ఉగ్రవాదుల అంతానికి మంచి అవకాశం
ఉగ్రవాదులను అంతం చేయడానికి మంచి అవకాశం దొరికిందని, అయితే సమయం మళ్లీ వస్తుందన్నారు. యుద్ధం నిలుపుదల చేయడంపై మోదీ, విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు విధాలుగా మాట్లాడారన్నారు. గ్రేటర్ బెంగళూరు కాదు, క్వార్టర్ బెంగళూరు అని ప్రతిపక్ష నేత ఆశోక్ మాట్లాడటంలో అర్థం లేదన్నారు. ఆయనకు క్వార్టర్ ఎప్పుడూ గుర్తు ఉండటం వల్లే గ్రేటర్ కాదు, క్వార్టర్ అని అంటున్నారని ఎద్దేవా చేశారు. బెంగళూరును మూడు కార్పొరేషన్లుగా విభజించే దిశగా ముందుకెళుతున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేయడంపై ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు. అయితే అది వారి వారి వ్యక్తిగతం అన్నారు. యుద్ధానికి ప్రతి భారతీయుడు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. రెండేళ్ల సాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. డీసీఎం డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా మంగళూరు పర్యటనకు వెళ్లిన సీఎం కొత్తగా ప్రజా సౌధ పేరుతో నిర్మించిన కలెక్టర్ భవనాన్ని ప్రారంభించారు.
మనపై దాడి చేసిన వారిపై బదులు తీర్చుకోవాల్సిందే
పాకిస్తాన్‌తో యుద్ధం వద్దని
నేనెప్పుడూ అనలేదు
కొప్పళ జిల్లా గిణిగేరాలో
సీఎం సిద్ధరామయ్య వెల్లడి