
ఘనంగా వ్యవసాయ స్నాతకోత్సవం
శివాజీనగర: బెంగళూరు వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విద్య, పరిశోధనా, విస్తరణలో దేశంలోనే ప్రఽథమ స్థానంలో ఉందని, వ్యవసాయ రంగంలో హరితవిప్లవం ద్వారా ఆహార ధాన్యం ఉత్పత్తిలో సుస్థిరతకు నాంది పలికిందని వ్యవసాయ మంత్రి ఎస్.చెలువరాయస్వామి తెలిపారు. గురువారం వర్సిటీ 59వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాల్లో వర్సిటీ పట్టభద్రులు పెద్ద సంఖ్యలో నియామకం కావడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ గెహ్లాట్ పట్టభద్రులకు పట్టాలను, పతకాలను అందజేశారు. 5 మంది బంగారు పతకాలను అందుకున్నారు. 311 మందికి పీజీ , 89 మందికి పీహెచ్‌డీ పట్టాలను బహూకరించారు.
సోను నిగమ్‌పై చర్యలు వద్దు: హైకోర్టు
శివాజీనగర: ప్రముఖ గాయకుడు సోను నిగమ్‌కు హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. కొన్ని రోజుల కిందట బెంగళూరులో జరిగిన గాన కచేరీలో కన్నడపాట పాడమన్నందుకు ఆయన పహల్గాం ఉగ్రదాడితో పోల్చడం పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ సోను నిగమ్ దాఖలు చేసిన అర్జీని గురువారం విచారణ జరిపిన హైకోర్టు, ఆయనపై పోలీసులు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశించింది.
సుహాస్‌శెట్టి హత్యకేసులో ముగ్గురు అరెస్ట్
బనశంకరి: మంగళూరులో రౌడీషీటర్, హిందూ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్యకేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు గురువారం అరెస్టు చేసినట్లు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. విలేకరులకు వివరాలను వెల్లడించారు. మంగళూరు నగరంలో నివసించే అజారుద్దీన్(29), అబ్దుల్ ఖాదర్ (24), బంట్వాళవాసి నౌషాద్ (39)లను అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. వీరందరిపై ఇదివరకే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. వీరు సుహాస్‌శెట్టి కదలికలపై సమాచారం అందించడం, హంతకులు కారులో పారిపోయేందుకు సహకరించారు. ఇంతకుముందే 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
చిన్నారి పేరు సింధూరి
మండ్య: ఆపరేషన్ సిందూర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని బాబురాయన కొప్పలు గ్రామంలో తమకు జన్మించిన కూతురికి తల్లిదండ్రులు సింధూరి అని పేరు పెట్టారు. సోమశేఖర్, హర్షిత దంపతులకు ఇటీవల పాప పుట్టింది. దేశంపైన ప్రేమతో సింధూరి అని నామకరణం చేసినట్లు తెలిపారు. మండ్య రక్షణ వేదిక అధ్యక్షుడు శంకర్‌బాబు ఆ దంపతులను సన్మానించి, పాప పేరిట రూ.10 వేలు బ్యాంకులో డిపాజిట్ చేశారు.
కారును కంటైనర్ ఢీ,
డ్రైవర్ మృతి
మైసూరు: కంటైనర్ లారీ అదుపు తప్పి కారును ఢీకొనడంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించిన ఘటన నంజనగూడు–గుండ్లుపేటె హైవే –766లో సింధువళ్లిపుర వద్ద జరిగింది. వివరాలు.. మండ్యకు చెందిన బాధితులు చామరాజనగర జిల్లా గుండ్లుపేటె వైపు కారులో వెళుతున్నారు. సింధువళ్లిపుర వద్ద ఎదురుగా అతి వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్, అసోంవాసి దినేష్ దుర్మరణం చెందాడు, కారులో ఉన్న మండ్య నగరసభ సభ్యుడు శివప్రకాష్ కుమారుడు, టెక్కీ తేజస్ కుమార్, అతని సోదరుడు కుశాల్, ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం మైసూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

ఘనంగా వ్యవసాయ స్నాతకోత్సవం

ఘనంగా వ్యవసాయ స్నాతకోత్సవం