
ప్రధానిపై అనుచిత పోస్టు
యశవంతపుర: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకున్ని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. మంగనమ్మనపాళ్యకు చెందిన నవాజ్.. ఇటీవల పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియో తీశాడు. దీనిని పబ్లిక్ సర్వేంట్ పేరుతో ఇన్‌స్టా లో పోస్ట్ చేశాడు. వీడియో గురించి తెలిసి పోలీసులు నిందితున్ని గుర్తించి నిర్బంధించారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
యల్లమ్మ కరగ
కోలారు: నగరంలోని పిసి కాలనీలో ఉన్న రేణుకా యల్లమ్మ దేవి కరగ ఉత్సవాన్ని సోమవారం రాత్రి రమణీయంగా నిర్వహించారు. కరగ పూజారి బివి మంజునాథ్ కరగను, జాతీయ జెండాను పట్టుకుని నృత్యం చేయడం ముగ్ధుల్ని చేసింది. సోమవారం రాత్రి 8 గంటలకు కరగ వేడుక ఆరంభమై అర్ధరాత్రి దాటే వరకూ కొనసాగింది. వివిధ దేవుళ్ల పల్లకి ఉత్సవం అలరించింది.
ఇద్దరు బాలల జలసమాధి
దొడ్డబళ్లాపురం: కావేరి నదిలో ఈత కొట్టడానికి దిగిన ఇద్దరు బాలురు నీట మునిగి మృతిచెందిన సంఘటన కొడగు జిల్లా మడికెరి తాలూకా నాపోక్లు వద్ద జరిగింది. కూరుళి గ్రామం వద్ద ప్రవహిస్తున్న కావేరి నదిలో ఈతకొట్టడానికి 8 మంది బాలలు దిగారు. వారిలో గిరీష్ (16), అయ్యప్ప (17) నదిలో మునిగిపోయి చనిపోయారు. వీరు సమీప చేరంబాణె ప్రాంతానికి చెందినవారు. నాపోక్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆస్పత్రి లిఫ్టు ఆగి నరకం
దొడ్డబళ్లాపురం: కల్బుర్గిలోని ప్రభుత్వ జిమ్స్ ఆస్పత్రిలో ఉన్న లిఫ్ట్‌లో 8 మంది చిక్కుకోగా వారిని అతి కష్టం మీద రక్షించిన సంఘటన మంగళవారంనాడు చోటుచేసుకుంది. కింది అంతస్తు నుంచి 6వ అంతస్తుకు వెళ్లడానికి 8మంది సిబ్బంది లిఫ్ట్‌లో ఎక్కారు. అయితే లిఫ్ట్ మూడవ అంతస్తుకు చేరుకోగానే నిలిచిపోయింది. అక్కడ తలుపులకు బదులు గోడ ఉంది. దీంతో 8మంది లిఫ్ట్‌లోనే చీకటి, గాలి ఆడక హాహాకారాలు చేశారు. కొన్ని గంటలపాటు శ్రమించిన ఆస్పత్రి సిబ్బంది గోడను పగలగొట్టి వారి రక్షించారు. బాధితులు అస్వస్థతకు గురికావడంతో వారికి వైద్యచికిత్సలు అందజేశారు.
కశ్మీర్ నుంచి రాక
శివాజీనగర: భారత–పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కశ్మీర్‌లో చిక్కుకొన్న కన్నడ విద్యార్థులు మంగళవారం బెంగళూరుకు చరుకొన్నారు. 6 నెలల క్రితం కశ్మీర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదివేందుకు 13 మంది కన్నడ విద్యార్థులు వెళ్లారు. యుద్ధం వల్ల కాలేజీకి సెలవు ఇవ్వగా, బయటకు రాలేక, అక్కడ ఉండలేక అవస్థలు పడసాగారు. ఎట్టకేలకు బెంగళూరుకు చేరుకుని స్వస్థలాలకు వెళ్లిపోయారు. అక్కడ భయం భయంగా గడిపామని హరీశ్, నూతన్ అనే విద్యార్థులు తెలిపారు.
కిలాడీ దొంగ..
88 చోరీ కేసులు
బనశంకరి: బెంగళూరులో చోరీలకు పాల్పడుతున్న ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల నగరంలో కొడిగేహళ్లిలో ఇంటి తాళం బద్దలు కొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులు గాలించి జేబీ నగరలో నివసించే గోదావరి వాసి కామేపల్లి శ్రీనివాస్ అలియాస్ కార్తీక్ (39) అనే దొంగను అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.9.20 లక్షల విలువచేసే 148 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి సొత్తుని స్వాధీనం చేసుకున్నారు.
గత నెల 16వ తేదీన చోరీ చేసిన తరువాత ఓ ప్రైవేటు హాస్టల్‌లో మకాం వేశాడు. పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఇతర ఆధారాల ప్రకారం పట్టుకున్నారు. కార్తీక్‌కు దొంగతనాలే వృత్తి అని, బీదర్, హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు 10 పోలీస్ స్టేషన్లలో పాత నేరస్తుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కార్తీక్, మోహన్‌రుద్ర అనే పేర్లతో తిరుగుతూ చోరీలకు పాల్పడేవాడు. ఎన్నిసార్లు అరెస్టయి జైలుకు వెళ్లినా తిరిగి వచ్చి మళ్లీ హస్తలాఘవాన్ని ప్రదర్శించేవాడు. ఇతడిపై ల్యాప్‌టాప్, ఇళ్లలో చోరీలతో పాటు 88 కి పైగా కేసులు ఉన్నట్లు చెప్పారు.

ప్రధానిపై అనుచిత పోస్టు