
ఉవ్వెత్తున వర్షాలు
బనశంకరి: నైరుతి రుతు పవనాలు వచ్చేశాయా? అన్నట్లుగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి జోరువానలు కురుస్తున్నాయి. బెంగళూరు నగరంలో మంగళవారం కూడా వర్షం కురిసింది. అతి దట్టంగా మేఘావృతమైంది. అక్కడక్కడ వడగండ్లు పడ్డాయి. మాన్యతా టెక్‌పార్కు రోడ్డు పూర్తిగా జలమయమైంది, ఇక్కడ సిటీ బస్సులోకి నీరు చేరింది. కావేరి జంక్షన్ వద్ద చెట్టుకొమ్మ విరిగిపడింది, విండ్సర్ మ్యానర్ అండర్‌పాస్ నుంచి ప్యాలెస్ మైదానం వరకు వెళ్లే మార్గంలో కొన్ని చెట్లు విరిగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శేషాద్రిపురం రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహించింది. కళ్యాణ నగర బాణసవాడి చుట్టుపక్కల వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. బాణసవాడి రోడ్డులోనూ చెట్లు పడిపోయాయి.
మరికొన్ని జిల్లాల్లో
మైసూరు, చిక్కమగళూరు, బెళగావి, ధార్వాడ, బళ్లారి తదితర ప్రాంతాలలో మంగళవారం జోరువానలు పడ్డాయి, రోడ్లు వాననీటితో నిండిపోయాయి. వేసవి ఎండల స్థానంలో చల్లని వాతావరణం ఏర్పడింది.
బెంగళూరు సహా ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో వానలు