
భారీ వర్షం.. ఇబ్బందుల్లో జనం
సాక్షి,బళ్లారి: వాతావరణంలో ఆకస్మిక మార్పులతో మండు వేసవిలో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 5 గంటలకు వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ముందుగానే వర్షాలు ప్రారంభమైనా ఇంత పెద్ద వాన కురవడం తొలిసారి కావడంతో ఒక్కసారిగా ప్రజలకు ఓ వైపు సంతోషం, మరోవైపు దుఃఖం కలిగించింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అల్లాడిపోయారు. విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లోకి నీరు ప్రవహించడంతో రాత్రంతా జనం జాగరణ చేశారు. దాదాపు 18 గంటలకు పైగా నగరం మొత్తం విద్యుత్ తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. తెగిపడిన విద్యుత్ వైర్లను యథాస్థానంలో ఏర్పాటు చేసి, మళ్లీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ఖరీఫ్ పదునుకు అదును
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో భారీ వర్షం కురవడంతో రైతన్నలకు సేద్యం పనులు చేసుకునేందుకు వీలైందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పదును కావడంతో వర్షాధారిత భూముల్లో ఒకటి రెండు రోజుల్లో సేద్యం పనులు జోరుగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటామని రైతులు పేర్కొంటున్నారు. కాగా వర్షం వచ్చినప్పుడల్లా బురదమయంగా మారే ఏపీఎంసీ కూరగాయల మార్కెట్ మళ్లీ అస్తవ్యస్తంగా తయారైంది. బురదలోనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు విక్రయించారు. ఇటు రైతులతో పాటు వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీఎంసీ మార్కెట్‌ను బాగు చేయడంపై అధికారులు, పాలకులు దృష్టి పెట్టకపోవడంతో వర్షం వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు పడాల్సిందేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చొరబడడంతో ఇళ్లలో ఉన్న తిండిగింజలు, ఇతర ఆహార సామగ్రి తడిచిపోయి ఆయా కాలనీల్లో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ కోత
ఇళ్లలోకి నీరు చేరి జనం పాట్లు
అస్తవ్యస్తంగా ఏపీఎంసీ మార్కెట్

భారీ వర్షం.. ఇబ్బందుల్లో జనం

భారీ వర్షం.. ఇబ్బందుల్లో జనం