
గోశాల స్థలంలో ఆక్రమణలు తొలగించాలి
రాయచూరు రూరల్: నగరంలో నగరసభ కేటాయించిన గోశాల స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న కట్టడాలను తొలగించాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1942లో నగరసభ వార్షిక టెండర్ ప్రక్రియలో గోశాల సమితికి అప్పగిస్తూ 3.25 ఎకరాల భూమిని కేటాయించారన్నారు. 1965లో సమితికి పూర్తి అధికారంతో పన్నూలు వసూలు చేశారన్నారు. ఇంత వరకు కూడా పన్నులు కట్టారన్నారు. కొంత మంది రాజకీయ నాయకుల మద్దతుతో గోశాలలోని 2.25 ఎకరాల భూమి తమదే అంటూ గోపాల్ సింగ్ పుత్రులు ఆ ప్రాంతంలో నగరసభ, నగర ప్రాధికార, జిల్లాధికారి అనుమతి లేకుండా కట్టడాలను నిర్మిస్తున్నారన్నారు. ఈ విషయంలో కలబుర్గి హైకోర్టు, జిల్లాధికారి కోర్టులో కేసు విచారణలో ఉండగా నిర్మాణాలు చేపట్టడం తప్పని వాటిని నిలుపుదల చేయాలని అధికారులను ఒత్తిడి చేశారు.
రిజర్వేషన్లను రద్దు చేయబోం
● కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి స్పష్టీకరణ
హుబ్లీ: రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తొలగిస్తారన్న దుష్ప్రచారం జోరుగా సాగుతోందని, ఇలాంటి ఏ నిర్ణయం తీసుకోలేదని, రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితిలో తొలగించబోమని, అసలు దాన్ని ముట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి స్పష్టం చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగం– 75 మార్చింది ఎవరు, పటిష్ట పరిచింది ఎవరు? అనే అమూల్య గ్రంథావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అత్యధిక పర్యాయాలు రాజ్యాంగాన్ని సవరించింది, దేశానికి అన్యాయం చేసిన వారే నేడు రాజ్యాంగాన్ని మారుస్తారన్న దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితిలోను రాజ్యాంగాన్ని మార్చబోమని కేంద్ర మంత్రిగా ఖరాఖండిగా చెప్పారు. అలాగే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు తొలగించడం కాదు, అసలు వాటిని ముట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వదని, సామాజిక న్యాయమే లక్ష్యంగా రిజర్వేషన్లు యథావిఽధిగా కొనసాగుతాయన్నారు. వాటిని తొలగించే ప్రసక్తే ఉండదన్నారు. ఏబీవీపీ ప్రముఖులు ప్రవీణ్ బీ రాజ్, చిత్రదుర్గ బసవమూర్తి, మాదార చెన్నయ్య స్వామి, ఆనంద హోసూర్, సచిన్ కుళగేరి, అమృత కొళ్లి తదితరులు పాల్గొన్నారు.
నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు బాలుర దుర్మరణం
రాయచూరు రూరల్: భీమా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు దుర్మరణం పాలైన ఘటన యాదగిరి జిల్లా వడగేర తాలూకా గురుసణిగి వద్ద సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వేసవిలో ఎండలు అధికం కావడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం నదిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగిపోయి షకీల్(18), మహబూబ్(20) మృత్యువాత పడ్డారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సామాజిక స్పృహ, వ్యక్తిత్వం పెంపొందించుకోవాలి
హుబ్లీ: సాధన చేయడానికి విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. జీవితంలో దొరికే అవకాశాలను సరైన రీతిలో అందిపుచ్చుకొని తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని అఖిల భారత ఆకాశవాణి నాటక కళాకారుడు డాక్టర్ శశిధర్ నరేంద్ర సూచించారు. కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం మీటింగ్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అంతర్ డివిజన్ యువజనోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలకు సంస్కారం, సంస్కృతి, సహనం, ఓర్పు వంటి ఉత్తమ లక్షణాలను ఇంట్లోనే తల్లిదండ్రులు చక్కగా వివరించి చెప్పాలన్నారు. సంస్కారం నేర్పించకపోతే దుర్ఘటనలు సంభవిస్తాయని హెచ్చరించారు. సప్తస్వరాలను సుశ్రావ్యంగా పాడాలంటే కఠినమైన అభ్యాసం చేయాలన్నారు. భారత దేశం కళలను పోషించే దేశం. ప్రపంచానికి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పిన దేశం మనది అన్నారు. వీరయోధులైన వైభవ సూర్యవంశీ, డీ.గుకేష్, సోఫియా ఖురేశి, వ్యోమికా సింగ్ సాధనలను యావత్ ప్రపంచం ప్రశంసించిందన్నారు. మనసు పెడితే ఎవరైనా గొప్ప కార్యాలను సాధించవచ్చన్నారు. మన జీవితాలను సుసంస్కృత వాతావరణంలో చక్కగా తీర్చుదిద్దుకోవాలని ఆయన సూచించారు. సంస్కారం నేర్చుకోవడానికి యువజనోత్సవం దోహపడుతుందన్నారు. ఆ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సీ.బసవరాజు మాట్లాడుతూ నేడు సమాజం విచ్ఛిన్నం అవుతోందన్నారు. ఉత్తమ సమాజ నిర్మాణ గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాఠాలతో పాటు పాఠ్యేతర కార్యకలాపాలను ప్రోత్సహించాలని, ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు మనిషిలో పరివర్తనకు దారి దీపాలన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రణతి, రీమా, భూమిక, హర్షిక తదితరులు పాల్గొన్నారు.

గోశాల స్థలంలో ఆక్రమణలు తొలగించాలి