
పెళ్లివేడుకలో హాస్యనటుని విషాదాంతం
గుండెపోటుతో రాకేశ్ మృతి
టీవీ యాక్టర్‌గా మంచి పేరు
యశవంతపుర: హాస్య నటనతో అందరినీ నవ్వించే వర్ధమాన నటుని జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కన్నడంలో వస్తున్న కామెడీ కిలాడీలు సీరియల్‌లో గుర్తింపు పొందిన హాస్య నటుడు రాకేశ్ పూజారి (33) హఠాన్మరణం చెందారు. దక్షిణ కన్నడ జిల్లా కార్కళ నిట్టె సమీపంలోని మియ్యారిలో ఆదివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి మెహందీ వేడుకలో పాల్గొన్న రాకేశ్ వేదిక మీదే కుప్పకూలారు. అతిథులతో మాట్లాడుతూ ఉండగా నేలకు ఒరిగిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో చనిపోయాడు. కార్డియాక్ అరెస్టే కారణమని వైద్యులు పరిశీలించి తెలిపారు. రిషభ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్–1లో రాకేశ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ కోసం ఉడుపిలో ఉండిపోయాడు. షూటింగ్‌లో పాల్గొని, పెళ్లి వేడుకకు వెళ్లినట్లు తెలిసింది.
నటనలో రాణిస్తూ ఉండగానే
రాకేశ్ ఉడుపిలో దినకర్ పూజారి, శాంభవిలకు జన్మించాడు. 2018లో జీ కన్నడ చానెల్ కార్యక్రమం ద్వారా టీవీ నటునిగా వచ్చారు. తరువాత అనేక తుళు, కన్నడ సినిమాలలో నటించారు. విలక్షణమైన తమాషా నటనతో అలరించేవాడు. రియాలిటీ షోలు, కన్నడ సీరియళ్లలో నటన ద్వారా ప్రజల మనస్సులో స్థానం సంపాదించారు. రాకేశ్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాకేశ్ లేడని తెలిసి చాలా బాధగా ఉందని కన్నడ నటి రక్షిత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కరోనా వైరస్ తరువాత మధ్యవయస్కులు, యువకులు ఆకస్మాత్తుగా గుండెనొప్పితో చనిపోవడం పెరిగిందని సమాచారం.

పెళ్లివేడుకలో హాస్యనటుని విషాదాంతం

పెళ్లివేడుకలో హాస్యనటుని విషాదాంతం