పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం
రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్‌లోని బైసారన్, పహల్గాంల మధ్య మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారికి కాంగ్రెస్, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి సంతాప ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో కేపీసీసీ కార్యాధ్యక్షుడు, ఎమ్మెల్సీ వసంత కుమార్, రవి, విశ్వ హిందూ పరిషత్, భజరంగ దళ్ సంచాలకులు మునిరెడ్డి మాట్లాడారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం న్యాయం లభించేలా చూడాలన్నారు. ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. తీన్ కందిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేశారు. ర్యాలీలో శ్రీనివాసరెడ్డి, శాలం, రజాక్ ఉస్తాద్, బసవరాజ్ పాటిల్ ఇటగి, రాజశేఖర్ రామస్వామి, ప్రేమలతలున్నారు.
ఉగ్రవాదులను అంతం చేయాలి
హొసపేటె: ఉగ్రదాడిని ఖండిస్తూ పునీత్‌కుమార్ సర్కిల్‌లో సీపీఐ(ఎం) తాలూకా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎన్.యల్లాలింగ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉగ్రవాదుల నిర్మూలనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ(మార్క్సిస్ట్) పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సంకుచితంగా ఉండకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కశ్మీర్‌లోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలన్నారు. పర్యాటకుల కుటుంబాలు చెప్పినట్లుగా అక్కడి ముస్లిం సమాజం రక్షణ కోసం నిలుస్తోందన్నారు. ఈ విషయంలో మత ఘర్షణలను నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన భార్య, పిల్లల ముందే తనను కాల్చి చంపిన ఉగ్రవాదులను ఎప్పటికీ క్షమించరాదన్నారు. కానీ దేశంలోకి చొరబాట్ల గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా సమాచారం ఉందా? అక్కడ రక్షణ దళ అధికారులను ఎందుకు మోహరించలేదు? అని ఆయన ప్రశ్నించారు. పార్టీ నేతలు ఏ.కరుణానిధి, జంబయ్య నాయక్, బిసాటి మహేష్, యల్లమ్మ, సిద్దలింగప్ప, ఉమామహేశ్వర, ఈడిగర మంజునాథ, వి.స్వామి తదితరులు పాల్గొన్నారు.
పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం
పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం


