
జోరందుకున్న వరి కోతలు
సాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాం కింద ఆయకట్టు పరిధిలో రబీ సీజన్‌లో సాగు చేసిన వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. ఆయకట్టు పరిధిలో బళ్లారి, రాయచూరు, విజయనగర, కొప్పళ జిల్లాల పరిధిలో సాగు చేసిన లక్షలాది ఎకరాల్లో వరి పంట కోతదశకు చేరుకోవడంతో ఇప్పటికే 25 శాతం వరి కోతలు పూర్తి కావడంతో పాటు కల్లాల్లో వరిధాన్యం ఆరబోసుకుని రైతులు అమ్మకానికి సిద్ధంగా ఉంచుతున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో వరి కోతలు చేస్తున్న రైతుల గుండెల్లో గుబులు నెలకొంది. ఆరు గాలం కష్టపడి పండించిన పంటలు రైతులకు చేతికందే వరకు ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు పడుతూ నష్టపోతున్న రైతులకు అకాల వర్షాలతో లబోదిబోమంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరి కోత యంత్రాలకు డిమాండ్
వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో వరి కోత మిషన్లకు కూడా బాగా గిరాకీ లభిస్తోంది. ఒక వైపు రైతులకు, రైతు కూలీలకు కూడా వరి కోతల వల్ల చేతి నిండా పని దొరుకుతోంది. పంట పండి చేతికందిన సమయంలో గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు, కోతకు వచ్చిన సమయంలో వర్షాలు వస్తే ఆ పంట నానిపోయి తీవ్ర నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తుంగభద్ర ఆయకట్టు కింద సాగు చేసిన వరిపంటను అష్టకష్టాలతో గట్టెక్కించుకుని, పెట్టిన పెట్టుబడులు కూడా దక్కించుకునేందుకు రైతులు పడిన బాధలు వర్ణించలేని విధంగా ఉన్నాయి.
ఈఏడాది డ్యాంలోకి పుష్కలంగా నీరు
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే తుంగభద్ర డ్యాంలోకి పుష్కలంగా నీరు రావడంతో పాటు సకాలంలో కాలువలకు నీరు వదలడంతో ఆయకట్టు కింద అదునులోనే వరినాట్లు వేయడంతో డ్యాంలో నీరు తగినంత ఉండటంతో వరి పంటకు నీటి సమస్య లేకపోవడంతో రైతులు అనుకున్నట్లుగా పంట కోత దశకు చేరుకోవడంతో గత 10 రోజుల నుంచి తుంగభద్ర ఆయకట్టు పరిధిలో ముమ్మరంగా వరి కోతలు జరుతున్నాయి. వరి పంట బాగా రావడంతో పెట్టిన పెట్టుబడులతో పాటు అంతో ఇంతో లాభాలు కూడా వస్తాయని రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో వారం రోజుల క్రితం కూడా వడగండ్లు వానతో పలు గ్రామాల్లో వరి పంట దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ గాలి వాన, వడగండ్లతో వానలు ప్రారంభం కావడంతో వరి కోతలు చేస్తున్న రైతుల్లో మరింత భయం నెలకొంటోంది.
రైతులకు తప్పని వాన కష్టాలు
రెండు రోజుల నుంచి మేఘాలు కమ్ముకుని వర్షాలు అక్కడక్కడ మళ్లీ కురుస్తుండటంతో కల్లాల్లో ఆరబోసిన రైతులు వడ్లు నానకుండా అష్టకష్టాలు పడుతున్నారు. వరికోతలకు వర్షాలు వస్తే మిషన్లు పొలాల్లోకి వెళ్లేందుకు వీలు కాక పనులు ఆగిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరికోతలు కోసే యంత్రాలు వర్షంలో పని చేయడానికి అనుకూలంగా ఉండకపోవడమే కాకుండా, నేల బురదమయంగా మారడంతో వరికోత మిషన్ ముందుకు కదలడం లేదు. వర్షానికి, గాలికి వడ్లు నేలరాలుతాయనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. తుంగభద్ర ఆయకట్టు కింద వరికోతలు చేపడుతున్న రైతులకు కోతల సమయంలో వర్షాలు కురవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. వర్షానికి వడ్లు నానిపోతే మార్కెట్‌లో ధర పడిపోతుందనే భయం కూడా అన్నదాతల్లో నెలకొంది.
పక్వానికి చేరిన రబీ సీజన్ పైరు
ఏపీఎంసీలో రాశులుగా ధాన్యం

జోరందుకున్న వరి కోతలు

జోరందుకున్న వరి కోతలు