డామిట్‌.. కథ అడ్డం తిరిగిందా.! | - | Sakshi
Sakshi News home page

డామిట్‌.. కథ అడ్డం తిరిగిందా.!

Apr 11 2025 1:09 AM | Updated on Apr 11 2025 1:09 AM

డామిట్‌.. కథ అడ్డం తిరిగిందా.!

డామిట్‌.. కథ అడ్డం తిరిగిందా.!

సాక్షి,బళ్లారి: వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చిన బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్రకు మళ్లీ మంత్రి అయ్యే యోగంపై సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో బలమైన నాయకుడుగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాగేంద్రకు వాల్మీకి అభివృద్ధి మండలిలో జరిగిన అవినీతి మాయని మచ్చగా మారింది. ఆయన తనపై వచ్చిన ఆరోపణలతో రాజీనామా చేయడంతో మళ్లీ మంత్రి అయ్యే వరకు జిల్లాలోకి అడుగుపెట్టనని, గత కాలంగా ఆయన బళ్లారి వైపు రాకపోవడంతో కాంగ్రెస్‌ కార్యకర్తల్లోనే కాకుండా గ్రామీణ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి వస్తానని తన సన్నిహితులతో ఆయన చెప్పినట్లు సమాచారం.

ప్రతిబంధకంగా గవర్నర్‌ ఆదేశాలు

మళ్లీ మంత్రి కావడానికి నాగేంద్ర తన వంతు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ కూడా నాగేంద్రకు మళ్లీ మంత్రి పదవి ఇప్పించాలని భావించారు. ఈ క్రమంలో హైమాండ్‌ దృష్టికి కూడా సీఎం ఈ విషయం తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో త్వరలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయుల్లో సంతోషం వెల్లివిరుస్తున్న సమయంలో రాష్ట్ర గవర్నర్‌ ఇచ్చిన ప్రాసిక్యూషన్‌ ఆదేశాలతో నాగేంద్రకు మంత్రి అయ్యే యోగం సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. వాల్మీకి అభివృద్ధి మండలిలో అవినీతిపై నాగేంద్రను ప్రాసిక్యూషన్‌ చేయాలని ఈడీ గవర్నర్‌ను కోరింది. నాగేంద్రతో పాటు 24 మందిపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరిపిన సంగతి తెలిసిందే. కేసు నమోదైనప్పుడు నాగేంద్ర మంత్రిగా పని చేస్తున్న తరుణంలో ఆయనపై ఈడీ కేసు నమోదు చేయడం, ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరడం తెలిసిందే.

తాజాగా చెక్‌బౌన్స్‌ కేసులో తీర్పు షాక్‌

ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర జైలుకు వెళ్లడం, బెయిల్‌పై బయటకు రావడం జరిగిపోయింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉంటూ మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తున్న సమయంలో ఆయనకు గవర్నర్‌ ఇచ్చిన ప్రాసిక్యూషన్‌ ఆదేశాలు గుదిబండగా మారనున్నాయి. ఈడీ చేసిన వినతికి నాగేంద్రపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంతో మళ్లీ నాగేంద్ర మంత్రి కావడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. అంతేకాకుండా నాగేంద్రపై చెక్‌బౌన్స్‌ కేసులో ఆయనకు రూ.1.25 కోట్ల జరిమానా విధించడం కూడా కలకలం రేపింది. నాగేంద్రపై ప్రైవేటు కంపెనీ దాఖలు చేసిన చెక్‌బౌన్స్‌ కేసులో జరిమానా కట్టకపోతే ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడంతో ఆయన పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. ఒక కేసు తర్వాత మరొకటి మీద పడటంతో మళ్లీ మంత్రి పదవి దక్కుతుందా, లేదా అన్నది ప్రశ్నార్థకంగా తయారైంది.

మంత్రి అయ్యే వరకు బళ్లారికి రానన్న నాగేంద్ర శపథం నెరవేరేనా?

ఒకటి తర్వాత మరొకటిలా

మాజీమంత్రిని చుట్టుముడుతున్న కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement