రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ చివరి ఆయకట్టు భూములకు నీరందక పోవడంతో రైతులు బిక్కముఖం వేస్తున్నారు. జిల్లాలో లక్షలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించే అవకాశాలున్నాయి. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు తగిన జాగ్రత్తలు పాటించడం లేదు. గతంలో ముఖ్యమంత్రిగా యడియూరప్ప వెలువరించిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించినందువల్లే నేడు ఆయకట్టు చివరి భూములకు నీరందక పంటలు వాడుముఖం పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పంట నష్టం వివరాలు
సింధనూరు, మస్కి, కవితాళ, మాన్వి ప్రాంతాల్లో వరి, పత్తి, మిరప పంటలు అధికంగా పండిస్తున్నారు. సింధనూరు, మస్కి, కవితాళ, మాన్వి ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల హెక్టార్లలో వరి పంటను, రాయచూరు, సిరవార తాలూకాలో లక్ష హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో మిరప పంటలను సాగు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు రోజుకు 3500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. కాలువకు నీటి విడుదలలో సామర్థ్యం మేరకు గేజ్ నిర్వహణ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల పంటలు చేతికొచ్చే సమయంలో నీటి లభ్యత కరువైంది. భద్రా జలాఽశయం నుంచి తుంగభద్రకు 6 టీఎంసీల నీటిని విడుదల చేసుకుంటే రైతులు కష్టాల నుండి గట్టెక్కుతారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
నేడు వికాససౌధలో ఐసీసీ సమావేశం
తుంగభద్ర ఎడమ కాలువకు నీటిని విడుదల చేసే అంశంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాడా అధ్యక్షుడు, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి అధ్యక్షతన అధికారులు, ఎమ్మెల్యేలతో వికాససౌధలో శుక్రవారం తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం జరుగనుంది. ఈనేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అందరి దృష్టి ఆ సమావేశంపై నెలకొంది.
ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు
అందని నీరు
సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో
పంట నష్టం
పంటలు వెలవెల.. రైతులు విలవిల
పంటలు వెలవెల.. రైతులు విలవిల