హుబ్లీ: జంట నగరాలలో మాదక ద్రవ్యాల సేవనం, విక్రయాలకు అడ్డుకట్టకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జంట నగరాల పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. ధార్వాడలోని జేఎస్‌ఎస్ కళాశాల సభా భవనంలో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జంట నగరాల విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్స్‌లర్లు, ప్రిన్సిపాళ్లు, అదే విధంగా వార్డెన్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జంట నగరాలలో పోకిరీలు, ఆకతాయిల ఆటకట్టిస్తున్నామన్నారు. వివిధ చోట్ల మత్తు మందుల ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో కేవలం పోలీస్ శాఖ వల్లే పూర్తిగా పరిష్కారం సాధ్యం కాదన్నారు. విశ్వవిద్యాలయాల పరిసరాల్లో మాదకద్రవ్యాల సేవనం, విక్రయాలు కనిపిస్తే తక్షణం సహాయవాణి ఫోన్ నెంబర్ 1930 అలాగే 1933, 1298, 112 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ విషయంలో ప్రజల సహాయ సహకారాలు అవసరమన్నారు. కేఎంసీ డాక్టర్.కమ్మార, వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్.సరోజిని తదితరులు పాల్గొన్నారు.