
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 26 మంది
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని ఈశాన్య పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 26 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని, వాటిని స్వీకరించినట్లు కలబుర్గి డివిజనల్ కమిషనర్, ఎన్నికల అధికారి కృష్ణ బాజ్‌పాయ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నుంచి అమర్‌నాథ్ పాటిల్, కాంగ్రెస్ నుంచి చంద్రశేఖర్ పాటిల్, స్వతంత్ర అభ్యర్థిగా నారా ప్రతాప్‌రెడ్డితో పాటు 26 మంది నామినేషన్లను స్వీకరించామన్నారు.
దేవెగౌడ కుటుంబానికి దేవుడి ఆశీర్వాదం ఉంది
శివాజీనగర: మాజీ ప్రధాని హెచ్.డీ.దేవెగౌడ 92వ పుట్టిన రోజును పురస్కరించుకొని జేడీఎస్ కార్యాలయం జేపీ భవన్ ఆవరణలో ఆయన చిత్రపటానికి నాయకులు శనివారం క్షీరాభిషేకం చేశారు. బెంగళూరు మహానగర జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.ఎం.రమేశ్‌గౌడ, ఎమ్మెల్సీ టీ.ఏ.శరవణ పాల్గొని దేవెగౌడకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందుగా పార్టీ కార్యాలయంలో కేక్ కత్తిరించారు. శరవణ మాట్లాడుతూ దేవెగౌడ కుటుంబానికి కొందరు కళంకం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవానికి దేవెగౌడ కుటుంబానికి భగవంతుడి ఆశీర్వాదంతో అన్నింటినీ ఎదుర్కొనే శక్తి ఉందని తెలిపారు. రమేశ్‌గౌడ మాట్లాడుతూ దేవెగౌడ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆసుపత్రుల్లో పండ్లను పంపిణీ చేశామన్నారు. నాయకులు రేవణ్ణ, గోపాల్, శైలజా, కన్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా దిడ్డి బసవేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లా సిరివార తాలూకాలోని అత్తనూరులో దిడ్డి బసవేశ్వర రథోత్సవం వైభవంగా ముగిసింది.శుక్రవారం సాయంత్రం భక్తుల సమక్షంలో మఠాధిపతి శాంతమల్ల, అభినవ రాచోటి, సోమశంభునాథ, పంచాక్షరి, రేణుక, క్షీరలింగ శివాచార్య మహాస్వామీజీలు రథోత్సవానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రతిభావంతులకు కలెక్టర్ సన్మానం
మైసూరు: ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో జిల్లాలో టాప్ 10 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను జిల్లాధికారి డాక్టర్ కేవీ రాజేంద్ర శనివారం తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. జిల్లాధికారి మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఎల్‌ఎసీ అనేది విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టమని, ఈ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులను సాధించి భవిష్యత్తు లక్ష్యాలను అధిగమించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వచ్చే ఒత్తిడులను తట్టుకుని జీవిత లక్ష్యాలను చేరుకోవాలని అభిలషించారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు.
నీటి సంరక్షణ అందరి బాధ్యత
కృష్ణరాజపుర: నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే బీఏ బసవరాజు అన్నారు. నగరంలోని నీటి సద్వినియోగంపై శాంతకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామ్మూర్తినగరలో శనివారం వాక్‌థాన్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం నీటికి కటకట ఏర్పడిన నేపథ్యంలో నీటి పొదుపు, సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాక్‌థాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
మైసూరులో చైన్ స్నాచింగ్
మైసూరు: మైసూరులో ఎంఎస్ షాలిని అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడలోని రూ. 2 లక్షల విలువ చేసే బంగారు గొలుసును దొంగ లాక్కెళ్లాడు. ఈ ఘటన కామనకెరెహుండి వద్ద జరిగింది. బన్నూరు రోడ్డులో ఉన్న ఎంఐటీ కాలేజీలో షాలిని పని చేస్తోంది. కాలేజీ నుంచి భోజనం కోసం గిరిదర్శిని లేఔట్‌లో ఉన్న ఇంటికి స్కూటర్లో వెళ్లింది. తిరిగి వస్తుండగా బైక్‌లో వెనుక నుంచి వెంబడించి వచ్చిన దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 26 మంది

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 26 మంది

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 26 మంది