గందరగోళంతో మేయర్‌ ఎన్నిక వాయిదా | Sakshi
Sakshi News home page

గందరగోళంతో మేయర్‌ ఎన్నిక వాయిదా

Published Wed, Nov 29 2023 1:38 AM

రాయల్‌ సర్కిల్‌ వద్ద ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు  - Sakshi

సాక్షి,బళ్లారి: బళ్లారి నగర మేయర్‌ ఎన్నిక గందరగోళం మధ్య వాయిదా పడింది. మంగళవారం మేయర్‌ ఎన్నికను నిర్వహించేందుకు సంబంధిత ఎన్నికల అధికారి అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో మేయర్‌ పదవిని దక్కించుకునేందుకు ఎస్సీ వర్గానికి చెందిన నలుగురు కార్పొరేటర్లు నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు 21 మందితో పాటు స్వతంత్రంగా గెలుపొందిన ఐదుగురు కార్పొరేటర్లు ముందు నుంచి కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నందున ఆ పార్టీకి బలం 26 మందికి చేరింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారిని మేయర్‌గా ఎన్నుకునేందుకు సులభంగా అవకాశం ఉన్నా మేయర్‌ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మేయర్‌ ఎన్నిక ఉత్కంఠంగా మారింది. దీంతో చివరికి ఎన్నిక వాయిదా వేసేందుకు దారితీసింది. జిల్లా మంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే, నేతలు మేయర్‌ ఎంపికను ఏకగ్రీవంగా జరిపేందుకు ప్రయత్నించకపోవడంతో నగరంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. మేయర్‌ పదవి కోసం మించు శ్రీనివాస్‌, కుబేర, శ్వేతలతో పాటు బీజేపీకి చెందిన గుడిగంటి హనుమంతు నామినేషన్‌ వేశారు.

అధికార పార్టీ నేతల్లో కొరవడిన సఖ్యత

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్ల మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు మంత్రి నాగేంద్ర, ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు నాసిర్‌ హుస్సేన్‌ మేయర్‌ ఎన్నిక జరిగే ప్రాంతానికి పలు కారణాలతో రాకపోవడంతో నామినేషన్‌ వేసిన వారంతా బరిలో నిలవడంతో మేయర్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. స్వతంత్రంగా గెలుపొందిన మించు శ్రీనివాస్‌కు బీజేపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. వీరితో పాటు స్వతంత్రంగా గెలుపొందిన ఐదు మంది కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మాజీ మేయర్‌ మోదుపల్లి రాజేశ్వరి, పద్మరోజా, ఉమాదేవి తదితర ఆరుగురు కార్పొరేటర్లు మించు శ్రీనివాస్‌ను మేయర్‌ను చేసేందుకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో కార్పొరేషన్‌ కార్యాలయ సభాంగణం గందరగోళం నెలకొంది. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెర వెనుక నుంచి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఏడీసీ తెలపడంతో కార్పొరేటర్లు భగ్గుమన్నారు.

భగ్గుమన్న కార్పొరేటర్లు

ఎన్నికను ఎందుకు వాయిదా వేస్తున్నారో తెలపాలని బీజేపీ కార్పొరేటర్లు ఇబ్రహీంబాబు, మోత్కూరు శ్రీనివాసరెడ్డి, గోవిందరాజులు, హనుమంతప్ప తదితరులు వాగ్వాదానికి దిగారు. మేయర్‌ ఎన్నిక నిర్వహిస్తామని తేదీ ఖరారు చేసి, నామినేషన్లు తీసుకుని, తగినంత కోరం ఉన్నా వాయిదా వేయడం వెనుక రాజకీయ దురుద్దేశం దాగి ఉందన్నారు. అధికారులు రాజకీయాలు చేయకూడదని, చట్ట ప్రకారం నడుచుకోవాలని, ఒకవేళ వాయిదా వేయాలనుకుంటే ముందుగా వేసి ఉండవచ్చని, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇలాంటి సంఽఘటన ఎక్కడా జరిగి ఉండదని మండిపడ్డారు. బీజేపీ హయాంలో 2008లో రిపబ్లిక్‌ ఆఫ్‌ బళ్లారి అని కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేశారని, మరి ఇప్పుడు జరుగుతున్నదాన్ని ఏమనాలని ప్రశ్నించారు. అప్పుడు కాదు ఇప్పుడే రిపబ్లిక్‌ ఆఫ్‌ బళ్లారి పాలన జరుగుతోందని, ఇంత కన్నా ఇంకేమి కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మేయర్‌ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. అయితే బీజేపీ కార్పొరేటర్లతో పాటు మేయర్‌ పదవికి నామినేషన్‌ వేసిన మించు శ్రీనివాస్‌, పలువురు స్వతంత్ర, కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు దాదాపు 25 మంది కార్పొరేషన్‌ సభాంగణంలోనే కూర్చొని ధర్నా చేపట్టారు.

సభాంగణంలోనే ఆందోళన

ఈ పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన పలువురు బయటి నుంచి ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లను బయటకు రప్పించేలా ప్రయత్నం చేశారు. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లోను బయటకు రాబోమని, ఎన్నిక జరిపి తీరాలని భీష్మించు కూర్చొన్నారు. కాగా మేయర్‌ ఎన్నిక విషయంలో శ్వేత లేదా కుబేరాను మేయర్‌గా చేయాలని, నగర ఎమ్మెల్యే మించు శ్రీనివాస్‌ను మేయర్‌ను చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోడంతో మేయర్‌ ఎన్నిక రసకందాయంలో పడింది. పైగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు బహిరంగంగానే రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తేలింది. జిల్లా మంత్రి సూచించిన వ్యక్తిని మేయర్‌ను చేయడానికి కాంగ్రెస్‌ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వకపోవడంతో బీజేపీ మద్దతుతో మించు శ్రీనివాస్‌ మేయర్‌ కావాలని ప్రయత్నించినా తాత్కాలికంగా వాయిదా పడటంతో మేయర్‌ పదవిపై ఉత్కంఠత నెలకొంది. దీంతో కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ రంజిత్‌ కుమార్‌ బండారి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాయల్‌ సర్కిల్‌లో బీజేపీ కార్పొరేటర్ల ధర్నా

నగర మేయర్‌ ఎన్నిక వాయిదా వేయడంపై బీజేపీ ఆందోళనకు దిగింది. మంగళవారం నగర మేయర్‌ ఎన్నిక జరగాల్సి ఉండగా ఎన్నికల అధికారి రాకపోవడంతో అనివార్య కారణాలతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అదనపు జిల్లాఽధికారి ప్రకటించిన అనంతరం కార్పొరేషన్‌ కార్యాలయంలో కాసేపు కూర్చొన్న అనంతరం రాయల్‌ సర్కిల్‌ వద్ద బీజేపీ నాయకులు బైఠాయించి ఆందోళనను ఉధృతం చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు మురహర గౌడ, ఉపాధ్యక్షుడు వీరశేఖరరెడ్డిలతో పాటు కార్పొరేటర్లు ఇబ్రహీంబాబు, హనుమంతప్ప తదితరులు రాయల్‌ సర్కిల్‌ వద్ద కూర్చొని కాంగ్రెస్‌ సర్కారు తీరును ఎండగట్టారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వ్యక్తి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారన్నారు. నామినేషన్లు వేసిన తర్వాత ఎన్నిక జరపాల్సి ఉండగా, పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి వాయిదా వేశారని మండిపడ్డారు. దళిత వ్యక్తిని మేయర్‌ కాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌ కుట్రలు చేసి అడ్డుకుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తినే మేయర్‌గా చేసేందుకు అవకాశం ఉన్నా ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. కాగా ఆందోళన విరమింపజేసేందుకు డీఎస్పీ చంద్రకాంత్‌ నందారెడ్డి నేతృత్వంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు తీవ్రంగా ప్రయత్నించినా రాత్రి వరకు ఆందోళన చేశారు. కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, సురేఖ మల్లనగౌడ, నాగరత్న పాల్గొన్నారు.

రెండు వర్గాలుగా చీలిపోయిన

కాంగ్రెస్‌ కార్పొరేటర్లు

అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ప్రకటించిన అధికారులు

ఎన్నిక వాయిదా వేయడంతో కార్పొరేషన్‌లో ధర్నాకు దిగిన కార్పొరేటర్లు
1/1

ఎన్నిక వాయిదా వేయడంతో కార్పొరేషన్‌లో ధర్నాకు దిగిన కార్పొరేటర్లు

Advertisement

తప్పక చదవండి

Advertisement