
శివాజీనగర: ప్రపంచమంతా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ గ్రామాల్లో ఇంకా అస్పృశ్యతను ఆచరిస్తున్నారా? అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆలయంలోకి దళిత కుటుంబం ప్రవేశానికి అడ్డుచెప్పి, కులంపేరుతో దూషించి దాడి చేసిన కేసులో ఎనిమిది మందిపై నమోదైన కేసును రద్దు చేయడానికి నిరాకరించింది. దావణగెరెకు చెందిన పాండురంగ భట్‌తో పాటుగా ఇతర ఏడు మంది నిందితులు వేసిన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేస్తూ అస్పృశ్యతపై ఆవేదన వ్యక్తంచేసింది. దళితులు అనే కారణంంతో దేవాలయంలోకి ప్రవేశానికి నిరాకరించటం చట్ట వ్యతిరేకం. ఇలాంటివి జరిగినపుడు న్యాయస్థానం ఆత్మసాక్షిని మేల్కొలుపుతుంది. మనిషి మనిషిలా నడుచుకోవాలని న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న ధర్మాసనం స్పష్టం చేసింది.
ఏమిటీ కేసు?
దావణగెరె జిల్లా హరిహర తాలూకాలోని వినాయక నగర క్యాంప్‌కు చెందిన సావిత్రమ్మ వారి కుటుంబం 2016 సెప్టెంబర్ 17న గడిచౌడేశ్వరి దేవాలయానికి వెళ్లారు. ఈ సమయంలో భట్, అతని వర్గీయులు అడ్డుకుని దాడి చేశారు. దీంతో సావిత్రమ్మ మలెబెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసు రద్దు చేయాలని కోరుతూ స్వరూప్ ఆశ్రమకు చెందిన పాండురంగ భట్, ఉషా, శారదా, విలాస్ లాడవ, వెంకటనారాయణ, చిదానంద, రవి, ఉమా అనేవారు హైకోర్టులో పిటిషన్ వేయగా చుక్కెదురైంది. అయితే 6 నెలల్లో విచారణను పూర్తిచేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
దళితులని దాడి తగదు: హైకోర్టు