
శివశంకర్ రెడ్డిని సన్మానిస్తున్న దృశ్యం
గౌరిబిదనూరు: ఒణకె ఓబవ్వ నేటి యువతకు ఆదర్శమని, ఆమె ధైర్య సాహసం చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచి పోయిందని మాజీ మంత్రి ఎన్‌హెచ్ శివశంకరరెడ్డి అన్నారు. ఆదివారం హెచ్‌ఎన్ కళాభవనంలో జరిగిన ఓబవ్వ జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మాతృభూమి పట్ల ఆమెకున్న అభిమానం అపారమని, కోటలోనికి చొరబడుతున్న హైదరాలి సైన్యాన్ని రోకలినే ఆయుధంగా చేసుకుని హతమార్చిందని వివరించారు. కార్యక్రమంలో కళాకారుడు రామకష్ణ, కమిషనర్ గీత, డా కెవి ప్రకాశ్, నాగరాజు, గొట్లగుంటె వెంకట రమణప్ప పాల్గొన్నారు.
కన్నడ భాష, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి
గౌరిబిదనూరు: విద్యార్థులు కన్నడ భాష, సంస్కృతి, చరిత్రపట్ల అవగాహన పెంచుకోవాలని తాలూకా కన్నడ సాహిత్య పరిషత్తు అధ్యక్షులు నంజుండప్ప తెలిపారు. సోమవారం నగరంలోని ఎస్‌ఎస్‌ఈ (మునిసిపల్) ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిల్లా సాహిత్య పరిషత్తు, విద్యాశాఖ, యువజన అక్షరాస్యత శాఖ వారిచే శనివారం జరిగిన రాత పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి ప్రశంసా పత్రాలను వితరణ చేసి మాట్లాడారు. విద్యార్థులలో కన్నడ భాషా పరంగా జాగృతి పరచాల్సిన అవసరాన్ని తెలిపారు. తీర్థ ఎడ్యుకేషన్ ట్రస్ట్ డా కెవి ప్రకాశ్ మాట్లాడుతూ... విద్యా ర్థులు పాఠ్యేతర పరీక్షలు, కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు వారిలో సృజనాత్మకమైన నైపుణ్యత పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జివి శ్రీనివాస్, బాలప్ప, ప్రవీణ్‌కుమార్, పద్మ, లోకేశ్, కళావిద రామకృష్ణ, శివమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అనంతకుమార్ సేవలు మరచిపోలేము
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో బీజేపీకి దివంగత కేంద్రమంత్రి అనంతకుమార్ చేసిన సేవలు మరిచిపోలేమని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. అనంతకుమార్ 4వ వర్ధంతి సందర్భంగా స్మృతి నడక కాగడాల ర్యాలీ ఊరేగింపులో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం యడియూరప్ప, అనంతకుమార్ ఇద్దరు పార్టీని రాష్ట్రంలో కంచుకోటగా మార్చారని అన్నారు. నేడు అనంతకుమార్ మన ముందు లేకపోవడం బాధాకరమన్నారు.
అగ్ని ప్రమాదం, ఏడుబోట్లు దగ్ధం
యశవంతపుర: ఉడుపి జిల్లా బైందూరు తాలూకా గంగోళ్లి బందర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు మత్స్యకారుల బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 15 బోట్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మత్య్సకారుల కళ్ల ముందే కోట్ల విలువైన బోట్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కరావళి కావలు దళం కేసు నమోదు చేశారు.
బస్సులో మంటలు
దొడ్డబళ్లాపురం: వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగిన సంఘటన నెలమంగల పరిధిలో చోటుచేసుకుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు ఉత్తర తాలూకా దాసనపుర డిపో నుండి నెలమంగ పట్టణానికి వస్తున్న బస్సు జేపీ ఆస్పత్రి వద్దకు రాగానే బస్సులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి బస్సులో నుండి దింపేసాడు. మంటలు చూసిన చుట్టుపక్కల జనం దూరంగా పరుగులు తీసారు. వెనుక వచ్చిన బస్సులో ఉన్న అగ్నిమాపక సాధనంతో మంటలు అర్పేసారు. నెలమంగల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

విద్యార్థులకు ప్రశంసా పత్రాలను వితరణ చేస్తున్న దృశ్యం

కాగడా ర్యాలీలో విజయేంద్ర తదితరులు

నడిరోడ్డుపై బస్సులో మంటలు