శివమొగ్గలో బీజేపీ సంబరాలు

- - Sakshi

శివమొగ్గ: శికారిపుర బీజేపీ ఎమ్మెల్యే బీవై విజయేంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకం కావడంతో శివమొగ్గతో పాటు శికారిపురలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. శనివారం శివమొగ్గలో యడియూరప్ప, ఎంపీ విజయేంద్ర మద్దతుదారులు యడ్డి ఇంటి వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఎంపీ రాఘవేంద్ర ఈ సంబరంలో పాల్గొన్నారు.

సీటీ రవి అసంతృప్తి!

దొడ్డబళ్లాపురం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బీవై విజయేంద్రను ఎన్నిక చేసినందుకు పార్టీ సీనియర్‌ నేత సీటీ రవి అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయేంద్ర నిబద్ధతతో పని చేసి పార్టీకి మళ్లీ అధికారం తెచ్చిపెట్టాలని, లోక్‌సభ ఎన్నికల్లో 28కి 28 స్థానాలు గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. మీరు పార్టీ అధ్యక్ష స్థానం కోసం పోటీ పడలేదా? అన్న ప్రశ్నకు.. తాను ఇక పార్టీ సామాన్య కార్యకర్తను అని పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 35 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నాను, ఇప్పుడు ఏమీ మాట్లాడనన్నారు.

బస్సు చార్జీలను పెంచం: మంత్రి

దొడ్డబళ్లాపురం: ప్రయాణికుల హితదృష్టితో ఇప్పట్లో కేఎస్‌ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచబోమని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. శనివారంనాడు దేవనహళ్లిలోని బీఎంటీసీ బస్‌ డిపోను సందర్శించిన ఆయన మాట్లాడుతూ బస్సు టికెట్‌ ధరల విషయమై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసమూర్తి 150 పేజీలతో కూడిన నివేదిక ఇచ్చారన్నారు. నిత్యం ప్రభుత్వ బస్సుల్లో 1.20 కోట్ల మంది ప్రయాణిస్తున్నారన్నారు. చార్జీలు పెంచితే సామాన్యులకి భారమవు తుందన్నారు. రాష్ట్రంలో కరువు రావడం వల్ల దసరా అట్టహాంగా జరపలేదని, టిప్పు జయంతిని కూడా ఇదే కారణంతో ఆచరించడం లేదన్నారు.

కొండచిలువ పట్టివేత

గౌరిబిదనూరు: తాలూకాలో బీరమంగల దగ్గర శుక్రవారం సాయంత్రం ఒక పొలంలో కొండచిలువ ఉండడం చూసి రైతులు అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. అటవీ అధికారి యల్లప్ప వచ్చి కొండ చిలువను పట్టుకున్నారు. దీనిని ఇండియన్‌ రాక్‌ పైథాన్‌గా పిలుస్తారని తెలిపారు. ఇది నీటి మడుగుల వద్ద, కొండ చరియలలో జీవిస్తు ఉంటుందని చెప్పారు. 6 అడుగుల పొడవైన ఈ కొండచిలువను గుడిబండె అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

భారీగా ఎర్రచందనం, ఏనుగు దంతాలు స్వాధీనం

చెళ్లకెరె రూరల్‌: చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా బబ్బూరు గ్రామంలో పోలీసులు రూ. 3 కోట్ల విలువైన ఎర్రచందనం, రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చిక్కమంగళూరు జిల్లా తరికెరకు చెందిన చంద్రశేఖర్‌, తమిళనాడుకు చెందిన ఖలీల్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితులు కట్టెల వ్యాపారం చేసుకుంటామని చెప్పి ఓ ఇంటిలో అద్దెకు దిగారు. వీరు ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్పీ ధర్మేంద్రకుమార్‌ ఆదేశాలతో చిత్రహళ్లి ఎస్‌ఐ కాంతరాజు, సిబ్బందితో దాడి చేసి నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం, ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్‌రీల్‌

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top