బీజేపీ ఎల్పీ సారథ్యం ఎవరికి?

- - Sakshi

సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్‌ సర్కారును విధానసభలో ఎదుర్కొనేందుకు గట్టి నేత కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికీ ఎంపిక చేయకపోవడం గమనార్హం. సోమవారం నుంచి కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేలతో విధానసభ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ పక్ష నేతగా, సీఎంగా సిద్ధరామయ్య ఉండగా, బీజేపీ ఎల్పీ నేతగా ఎవరు లేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అయితే ఈ మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల తరువాత ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమి గురించి ఆదివారం బీజేపీ ఆత్మావలోకనం జరిపినప్పటికీ ఇందులో ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై చర్చ జరగలేదు.

ఆ రెండు వర్గాల నుంచి..
మాజీ సీఎం బసవరాజ బొమ్మైని ప్రతిపక్ష నేత చేయాలని కొందరు, దూకుడుగా ఉండే బసవనగౌడ పాటిల్‌ యత్నాల్‌ని చేయాలని మరికొందరు పట్టుబట్టినట్లు సమాచారం. లింగాయత, ఒక్కలిగ ముఖం కలిగిన హిందూత్వ ఎజెండాను ఎత్తుకుని నడిపించే నాయకుడి కోసం బీజేపీ నాయకత్వం అన్వేషిస్తోంది. నిరాణి, సుధాకర్‌, సీటీ రవి వంటివారు జాబితాలో ఉన్నప్పటికీ వారు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో బీఎస్‌ యడియూరప్ప ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొగలిగే సీనియర్ల కొరత బీజేపీ వేధిస్తోంది. సీనియర్లు చాలా మంది ఓటమి పాలవ్వడం, గెలిచిన వారిలో చాలా మంది కొత్తవారు కావడం ఇలాంటి తరుణంలో ఎవరిని ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలనే అంశంపై హైకమాండ్‌ తర్జనభర్జన పడుతోంది.

రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలపై..
లింగాయత్‌ వర్గానికి చెందిన మాజీ సీఎం బసవరాజు బొమ్మై, ఒక్కలిగ వర్గానికి చెందిన శోభ కరంద్లాజే, సీఎన్‌ అశ్వత్థ నారాయణ, సీటీ రవిలో ఒకరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించే విషయంపై కూడా బీజేపీ చర్చ జరుగుతోందని తెలిసింది. జేడీఎస్‌ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఒక్కలిగలను ఇప్పటినుంచే తమ వైపునకు తిప్పుకునేందుకు ఆ సామాజికవర్గ నేతనే అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top