కేఆర్‌పీపీతోనే రాష్ట్రంలో బీజేపీ ఓటమి

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జనార్ధన్‌రెడ్డి తదితరులు   - Sakshi

గంగావతి రూరల్‌: రాష్ట్రంలో బీజేపీ ఓటమికి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ కారణమని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌ రెడ్డి అన్నారు, ఆదివారం ఆయన నగరంలోని కేఆర్‌పీపీ కార్యాలయంలో బళ్లారి విధానసభ క్షేత్రం బూత్‌స్థాయి పదాధికారులు, పార్టీ నాయకులతో ఆత్మావలోకన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పార్టీ ఏర్పాటుకు ముందు తనను తిరిగి బీజేపీలోకి తీసుకోవాలని చూశారని, తాను మాత్రం ఏ బీజేపీ నేత ఇంటికి కూడా వెళ్లలేదని, అమిత్‌, నరేంద్ర మోదీల వద్ద అసలు వెళ్లలేదని బీజేపీ నేతల గురించి వ్యంగ్యంగా అన్నారు.

అమిత్‌షా పలుమార్లు తనను కలవాలని చూశారని, అయితే తానే వారిని దూరంగా ఉంచానని, రాష్ట్రంలో బీజేపీ ఓటమికి కేఆర్‌పీపీ కారణమన్నారు. బళ్లారి విధానసభ క్షేత్రం ఎన్నికలో కేఆర్‌పీపీ పరాజిత అభ్యర్థి లక్ష్మీ అరుణ రెండో స్థానంలో నిలిచారని, ప్రజల మనసు గెలుచుకున్నారని అన్నారు. ఇప్పటి బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్రంలో నేను పెంచి పెద్ద చేసిన పిరికిపందలు, అన్నదమ్ములతో సహా అందరూ ఇళ్లల్లో ఉండే పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను ఒంటరిగానే విధాన సౌధకు వెళ్తున్నానని, తన మంచితనం కొంత మంది ఉపయోగించుకున్నారని అలాంటి వ్యక్తులకు రాబోవు రోజులో కాలమే శిక్షిస్తుందన్నారు.

బళ్లారిలో పాలికెలో సత్తా చాటుతాం
బళ్లారి మునిసిపల్‌ కార్పొషన్‌ ఎన్నికలతో పాటు వచ్చే జిల్లా పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో కేఆర్‌పీపీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలందరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. బళ్లారి మహాపాలికె ఈసారి అన్ని వార్డుల్లో కేఆర్‌పీపీ అభ్యర్థులు సత్తా చాటాలన్నారు. పరాజిత అభ్యర్థి లక్ష్మీ అరుణ మాట్లాడుతూ...ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉంటామని, నా ఓటమికి కాంగ్రెస్‌ హామీలే కారణమని అన్నారు.

కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ కొప్పళ జిల్లా అధ్యక్షుడు మనోహర గౌడ హేరూరు, బళ్లారి జిల్లా అధ్యక్షుడు గోనాళ రాజశేఖర గౌడతోపాటు ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా కల్యాణ రాజ్యా ప్రగతి పార్టీ యువ ఘటక అధ్యక్షుడు భీమశంకర పాటిల్‌, మహిళా ఘటక అధ్యక్షురాలు హేమలత, శ్రీనివాస్‌ రెడ్డి, హంపి రమణ పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top