బీజేపీ ర్యాలీల్లో జన ప్రభంజనం.. ఎన్నికల్లో మాత్రం పరాజయం

- - Sakshi

బనశంకరి: శాసనసభ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో హైకమాండ్‌ ప్రక్షాళన చేసే అవకాశముంది. బీజేపీ రాష్ట్రాద్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ను సాగనంపవచ్చు. 135 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీని శాసనసభలో ఎదుర్కోవడానికి బలమైన నేతను బీజేపీఎల్పీ నాయకునిగా ఎంపిక చేయనుంది.

గెలుపు తప్పిపోయి బోర్లా
రాష్ట్రంలో 224 నియోజకవర్గాల్లో సగానికిపైగా గెలిచి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని కాషాయ పెద్దలు ఘంటాపథంగా చెప్పారు. కానీ 66 సీట్లకు పరిమితమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే బీజేపీలోకి కొత్త రక్తం ఎక్కించాలని భావిస్తోంది. అంతేగాక బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ మీద కూడా నాయకత్వం సంతృప్తిగా లేదు. ఢిల్లీ నేతలు ఆయనను మార్చాలని నిర్ణయించినట్లు బీజేపీ వర్గాల సమాచారం. నిజానికి ఆయన పదవీకాలం 2022 తోనే ముగిసింది. కానీ శాసనసభ ఎన్నికలు ఉన్నాయనే కారణంతో కొనసాగించారు.

బొమ్మైకి ఒక పదవి?
బసవరాజ బొమ్మైకి పార్టీ అధ్యక్ష పదవి, లేదా బీజేపీ పక్ష నేత పదవిలో ఏదైనా ఒకటి దక్కవచ్చనే ప్రచారముంది. అసెంబ్లీ లోపల, బయట ప్రభుత్వంపై పోరాడే బలమైన నేత అవసరం బీజేపీకి ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. కనీసం 20 సీట్లలో గెలవాలని కాషాయం పట్టుదలతో ఉంది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూర్తి విశ్లేషణ చేయాలని నిర్ణయించినట్లు బొమ్మై సహా సీనియర్లు చెప్పారు. ఓటమిని సవాల్‌గా స్వీకరించి సమస్యలను పరిష్కరించుకుంటామని పార్టీ నేత ఒకరు తెలిపారు. శాసనసభ ఎన్నికల ఓటమిని నరేంద్రమోదీ ఓటమిగా భావించరాదని, మోదీ దేశానికి చెందిన నేత, కర్ణాటక ప్రచారం కోసం వచ్చారని బసవరాజ బొమ్మై అన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top