
నారా భరత్‌రెడ్డి మంగళవారం భారీ జన సందడితో కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు.
సాక్షి,బళ్లారి: బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మంత్రి శ్రీరాములు అట్టహాసంగా, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి నగరంలో ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మంగళవారం నగరంలోని తన నివాస గృహం వద్ద నుంచి ముందుగా గోమాతకు, అనంతరం కోటమల్లేశ్వర ఆలయంలో పూజలు చేసి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో పెద్ద ఎత్తున రోడ్డు షోతో ర్యాలీగా తరలివచ్చారు. రోడ్డులో షోలో ఆయనకు జైకారాలు కొడుతూ కార్యకర్తలు ముందుకు సాగారు. పెద్ద సంఖ్యలో చేరిన జనంతో రోడ్లన్ని నిండిపోయాయి. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో సంబంధిత ఎన్నికల అధికారికి కుటుంబ సభ్యులతో కలిసి ఒక సెట్, పార్టీ నేతలతో కలసి మరో సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, లోక్‌సభ సభ్యుడు దేవేంద్రప్ప, సీనియర్ న్యాయవాది పాటిల్ సిద్ధారెడ్డి, మాజీ ఎంపీలు జే.శాంత, సన్నపక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యే టీ.హెచ్.సురేష్‌బాబు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు మురహరగౌడ, రాష్ట్ర జవళి నిగమ అధ్యక్షుడు విరుపాక్షిగౌడ, బీజేపీ నాయకులు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
కేఆర్‌పీపీ అభ్యర్థిగా దివాకర్ నామినేషన్
సండూరు నియోజకవర్గం నుంచి కేఆర్‌పీపీ అభ్యర్థిగా కేఎస్ దివాకర్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన మంగళవారం సండూరులో భారీ జనసమూహంతో ర్యాలీగా బయలులేరి సంబంధిత ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు టికెట్ ఇస్తానని నమ్మబలికి మోసగించిన బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సండూరు అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ఈసారి తనను గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌రెడ్డి నామినేషన్
నగరంలో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌రెడ్డి మంగళవారం భారీ జన సందడితో కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో ఊరేగింపుగా వచ్చి నామినేషన్ పత్రాలను సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత ఎన్నికల అధికారికి అందజేశారు. అంతకు ముందు ఆయన కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విజయీభవ అనే వాహనంలో ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ తరలి వచ్చారు. మాజీ జెడ్పీ మెంబర్ అల్లం ప్రశాంత్, మాజీ బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, రాజ్యసభ సభ్యులు నాసీర్ హుస్సేన్ తదితరులతో పాటు గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర తదితర నాయకులు ర్యాలీలో పాల్గొని పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప, పార్టీ సీనియర్ నాయకులు ముండ్లూరు అనూప్ కుమార్, ముల్లంగి రవీంద్ర, మాజీ మేయర్ మోదుపల్లి రాజేశ్వరి, నాయకులు సునీల్ కుమార్, ముండ్లూరు చిట్టి పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ నామినేషన్
కంప్లి: క్షేత్ర కాంగ్రెస్ అభ్యర్థి జేఎన్ గణేష్ మంగళవారం నామినేషన్ వేశారు. తన ఇంటి నుంచి ఓపెన్ టాప్ వాహనంలో వందలాది కార్యకర్తలతో ఊరేగింపుగా బయలుదేరారు. ముందుగా ఉద్భవ గణపతి దేవస్థానం వద్ద పూజలు నిర్వహించి ఎడ్లబండిలో వివిధ వాయిద్యాలతో, కార్యకర్తల నినాదాలతో మున్సిపల్ కార్యాలయం చేరుకుని ఎన్నికల అధికారిణి డాక్టర్ నయనకు అభ్యర్థి గణేష్ నామినేషన్ అందించారు. కాగా ఎమ్మెల్యే గణేష్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే ఆయనను మళ్లీ గెలిపిస్తుందని మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప తెలిపారు. శ్రీనివాసరావు, కల్లుకంబ పంపాపతి, ముండ్రిగి నాగరాజ్, కౌన్సిలర్ భట్టా ప్రసాద్, కేఎస్ చాంద్‌బాష, లడ్డు హొన్నూర్‌వలీ, ఉస్మాన్, వీరాంజనేయులు, పీ.మౌలా పాల్గొన్నారు.
జిల్లాలో జోరుగా నామినేషన్ల పర్వం
రాయచూరు రూరల్: నగరంలో ఎస్‌యూసీఐ అభ్యర్థి వీరేష్ నామినేషన్ వేశారు. మంగళవారం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి రజనీకాంత్‌కు, దేవదుర్గలో కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీదేవి నాయక్, దేవదుర్గలో జేడీఎస్ అభ్యర్థిని కరియమ్మ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి చేతన్ కుమార్‌కు, రాయచూరు గ్రామీణలో జేడీఎస్ అభ్యర్థి నర సింహనాయక్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి శశికాంత్‌కు నామినేషన్ పత్రాలను అందించారు.
కేఆర్‌పీపీ అభ్యర్థి గాలి జనార్దన్‌రెడ్డి నామినేషన్
గంగావతి: కేఆర్‌పీపీ సంస్థాపకులు గాలి జనార్ధన్‌రెడ్డి మంగళవారం భారీ జన సందోహంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఉదయాన్నే చెన్నబసవస్వామి, దుర్గా దేవి ఆలయాలు, కర్నూల్ తాత దర్గాకు వెళ్లి పూజలు నెరవేర్చారు. సుమారు 10 గంటల సమయంలో తన నివాసం వద్దకు చేరిన వేలాది మంది జన సందోహంతో ఇస్లాంపుర్ సర్కిల్, మహావీర్ సర్కిల్ మీదుగా గాంధీ చౌక్ వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. మధ్యలో ఉన్న సర్కిళ్లలో జనార్దన్‌రెడ్డికి గజమాలలను క్రేన్‌తో వేశారు. పట్టణ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇంత పెద్ద స్థాయిలో జనసమీకరణ జరగలేదని నగర వ్యాప్తంగా పెద్ద చర్చకు తావిచ్చింది. దారి పొడవునా జనార్దన్‌రెడ్డి జిందాబాద్, పుట్‌బాల్ గుర్తుకే మీ ఓటు ఉన్న నినాదాలు మారుమోగాయి. నామినేషన్‌కు జనార్ధన్‌రెడ్డి భార్య లక్ష్మీఅరుణ, కుమార్తె బ్రహ్మణి, అల్లుడు తదితరుల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడ చూసినా జనం పెద్ద సంఖ్యలో గుమికూడి చేతిలో పుట్‌బాల్ గుర్తు కలిగిన జెండాలు, టోపీలు ధరించి కనిపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జేడీఎస్ అభ్యర్థి చెన్నకేశవ నామినేషన్
నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా తనదైన శైలిలో వందలాది మందితో ఊరేగింపుగా బస్టాండ్ సర్కిల్‌కు చేరుకున్న జేడీఎస్ పార్టీ అభ్యర్థి హెచ్‌ఆర్ చెన్నకేశవ మంగళవారం తన వాహనంలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జేడీఎస్ తాలూకా అధ్యక్షుడు షేక్ నబీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరలో జోరుగా నామినేషన్లు
హొసపేటె: హొసపేటె(విజయనగర) నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి హెచ్‌ఆర్ గవియప్ప తన సతీమణితో కలిసి సోమవారం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్‌కు ముందు అభ్యర్థి గవియప్ప పార్టీ కార్యకర్తలతో కలిసి గాంధీ సర్కిల్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నగర ప్రముఖ వీధులలో బృహత్ ఊరేగింపును నిర్వహించారు. అదే విధంగా విజయనగర జిల్లా కూడ్లిగిలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ తన పత్నితో కలిసి నామినేషన్‌ను ఎన్నిలకు అధికారులకు అందజేశారు.
