
స్వామీజీతో పాటు దీక్షలో పాల్గొన్న గాలి జనార్దన్‌రెడ్డి
గంగావతి: పంచమసాలి సమాజపు కూడల సంగమ పీఠాధిపతి బసవజయ మృత్యుంజయ స్వామీజీ చేపట్టిన పోరాటానికి తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నట్లు కేఆర్‌పీపీ సంస్థాపకులు గాలి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో స్వామీజీ చేపట్టిన రిలే దీక్షలో పాల్గొని మాట్లాడారు. పంచమసాలి సమాజానికి 2ఏ రిజర్వేషన్ కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోరాటానికి తమ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్‌ను కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పౌష్టికాహారంపై జాగృతి ర్యాలీ
రాయచూరు రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు పౌష్టికాహార పదార్ధాలను పంపిణీ చేయాలని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ భారతి పేర్కొన్నారు. గురువారం నీరుబావికుంటలో ఏర్పాటు చేసిన పీఎం మాతృవందన జాతాను ఆమె ప్రారంభించి మాట్లాడారు. అంగన్‌వాడీల్లో బలహీనంగా ఉన్న పిల్లలకు పౌష్టికాహార పదార్థాలను పంచాలని కోరుతూ కాలనీలో నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.
5వేల మందికి ఇళ్ల వసతి: ఎమ్మెల్యే
మైసూరు: ప్రతి ఒక్క పేదవారికి సొంత ఇల్లు ఉండాలనే కలను సాకారం చేస్తూ ఈ నెల 19న 5 వేల మందికి సొంత ఇళ్ల మంజూరు హక్కు పత్రాలను అందజేయనున్నట్లు ఎమ్మెల్యే ఎస్.ఎ. రామదాసు చెప్పారు. గురువారం నగరంలోని కృష్ణరాజ నియోజకవర్గంలో 65వ వార్డులో పర్యటించిన ఆయన ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. శ్రీరామపుర లేఔట్, బలమురి గణపతి దేవాలయంలో పూజలు చేసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. తన నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా సొంత ఇల్లు లేని వారిని గుర్తించి వారికి ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు.
పనుల నాణ్యత పరిశీలన
కంప్లి: పనుల్లో నాణ్యత లోపిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని జెడ్పీ సీఈఓ రాహుల్ శరణప్ప సంకనూరు హెచ్చరించారు. ఆయన గురువారం నెంబర్ 10 ముద్దాపుర, నెల్లుడి గ్రామాల్లో జీజీఎం పథకం ద్వారా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు, నరేగ పథకం కింద చేపట్టిన పనులను, ఎస్‌బీఎం ఘనవ్యర్థాల నిర్వహణ యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. టీపీ ఓఈ, కేఎస్‌ఎఫ్‌డీఏ సురేష్, కార్యదర్శి వీరభద్రగౌడ, టెక్నికల్ అసిస్టెంట్ మమత, సంయోజకుడు సంగమేష్, బిల్ కలెక్టర్ రాజాసాబ్ పాల్గొన్నారు.
యశస్విని కార్డుల పంపిణీ
రాయచూరు రూరల్: పేదల ఆరోగ్య చికిత్సలకు యశస్విని కార్డులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ విజయ్‌కుమార్ పాటిల్ పేర్కొన్నారు. గురువారం యరగేర పీఎల్‌డీ బ్యాంక్‌లో రైతులకు కార్డులను అందించి మాట్లాడారు. రైతులు, పేదలకు ఉచిత ఆపరేషన్లకు ఆ కార్డులు ఉపయోగపడతాయన్నారు. బ్యాంక్ అధ్యక్షుడు నిజాముద్దీన్, సభ్యులు వెంకటేష్, రఫీ, రామన్న, హన్మంతు, సల్మాన్, ఫకృద్దీన్, మహబూబ్‌లున్నారు.