పునీత్‌ పాటలు కోరినందుకు దాడి | - | Sakshi
Sakshi News home page

Mar 1 2023 1:00 AM | Updated on Mar 1 2023 1:00 AM

మైసూరు: దివంగత పవర్‌ స్టార్‌ పునీత్‌రాజ్‌ కుమార్‌ నటించిన అప్పు సినిమా పాటను పెట్టమని అడిగినవారిపైన కొందరు దాడి చేసిన సంఘటన మైసూరు నగరంలోని హెబ్బాలలో ఉన్న సోషల్‌ రిసార్టులో జరిగింది. బోగాదికి చెందిన వ్యాపారి యశ్వంత్‌ కుమార్‌ తనపై నటుడు దర్శన్‌ అభిమానులు దాడి చేసి కొట్టారని హెబ్బాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రిసార్టు నటుడు దర్శన్‌ స్నేహితుడు అయిన హర్ష మేలంటే కు చెందినది. సోమవారం రాత్రి భార్య పుట్టినరోజు ఉండడంతో యశ్వంత్‌కుమార్‌ ఈ రిసార్టులో పార్టీ పెట్టాడు. ఈ సమయంలో అక్కడి డీజే సిబ్బందికి దర్శన్‌ పాటలు వద్దని, పునీత్‌ పాటలు కావాలని అడిగాడు. దీనికి ఆగ్రహించిన దర్శన్‌ అభిమానులు వచ్చి దాడి చేసి కొట్టినట్లు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బీదర్‌లో మెడికో ఆత్మహత్య

యశవంతపుర: బీదర్‌ బ్రిమ్స్‌ హాస్టల్‌ 7వ అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. బ్రిమ్స్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థి శ్రీరామ్‌ కడగి (22) హాస్టల్‌ భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలై మరణించాడు. పరీక్షల భయంతో పాటు ఇటీవల తండ్రి మృతి చెందగా తీవ్ర మానసిక వేదనలో మునిగిపోయాడు. బీదర్‌ జిల్లా చిట్టగుప్పా తాలూకాకు చెందిన శ్రీరామ్‌ ఎంబీబీఎస్‌లో తన బ్యాచ్‌లో టాపర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఘటనాస్థలాన్ని బీదర్‌ న్యూటౌన్‌ పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.

యడ్డిని పదవి నుంచి ఎందుకు తప్పించారు ?

కేపీసీసీ చీఫ్‌ డీకేశి

శివాజీనగర: ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్పను ఆ స్థానం నుంచి ఎందుకు దించేశారో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలని కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...మళీ ఎన్నికలు వస్తుండటంతో యడియూరప్పను పొగిడి లబ్ధి కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. యడియూరప్పపై గౌరవం ఉంటే ఆయన సారథ్యంలోనే ఎన్నికలు వెళ్లేలా మోదీ చూడాలన్నారు. ఆపరేషన కమల ద్వారా 104 స్థానాలను పొంది అధికారంలోకి వచ్చేందుకు యడియూరప్ప కావాలని, ఆ తర్వాత అవసరం తీరాక ఆయనను సీఎం స్థానం నుంచి తప్పించి యడియూరప్ప కన్నీటికి కారణమయ్యారని ఎద్దేవా చేశారు.

జేడీఎస్‌కు షాక్‌, పార్టీ వీడనున్న మరో ఎమ్మెల్యే ?

శివాజీనగర: శాసనసభ ఎన్నికలకు ముందుగానే జేడీఎస్‌కు షాక్‌ తగులుతోంది. అరకలగూడు నియోజకవర్గ జేడీఎస్‌ ఎమ్మెల్యే ఏటీ.రామస్వామి తాను పార్టీని వీడనున్నట్లు తెలిపారు. అరసీకెర నియోజకవర్గ జేడీఎస్‌ ఎమ్మెల్యే శివలింగేగౌడ కాంగ్రెస్‌ చేరటం దాదాపుగా ఖరారు కాగా, ఈ మధ్య జేడీఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే అరకలగుడు నియోజకవర్గ జేడీఎస్‌ ఎమ్మెల్యే ఏ.టీ.రామస్వామి పార్టీ వీడనున్నట్లు వెల్లడించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తాను. అయితే ఏ పార్టీ నుంచి అనేది నియోజకవర్గ ఓటర్లు, మద్దతుదారులతో చర్చించి నిర్ధారిస్తానని తెలిపారు.

హాసన టికెట్‌పై త్వరలో నిర్ణయం

యశవంతపుర: హాసన టికెట్‌పై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. మంగళవారం ఆయన చిక్కమగళూరులో విలేకర్లతో మాట్లాడారు. మాజీ ప్రధాని దేవెగౌడ వైద్య పరీక్షలకు వెళ్లారు. ఆయన రాగానే టికెట్‌ విషయంపై తీర్మానం చేస్తామన్నారు. బీజేపీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నిజలింగప్ప, వీరేంద్రపాటిల్‌ పేర్లు చెప్పుకొని ఓట్లు దండుకోవటానికీ బీజేపీ ప్రయత్నిస్తుందని కుమార మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ఏమి తెచ్చింది, ఏమి ఇచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. మాజీ సీఎం యడియూరప్పపై ప్రీతి ఉంటే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు దించారని ప్రశ్నించారు.

అబ్కారీ శాఖలో అవినీతి కంపు

యశవంతపుర: అబ్కారి శాఖలో రెండు వందల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇందులో రూ.80 కోట్లు లంచం రూపంలో పొందినట్లు ఎమ్మెల్యే ప్రియాంక్‌ ఖర్గే, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రమేశ్‌ బాబు ఆరోపించారు. మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ... అబ్కారీ శాఖలో ఎగుమతి, మొలాసిస్‌కు సంబంధించి వ్యవహారంలో అవినీతి జరిగినట్లు ఆరోపించారు. అర్హతలేని సంస్థకు అనుమతులు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రూ. 80 కోట్లు సీఎం బొమ్మై, అబ్కారీ మంత్రి గోపాలయ్యలకు ముట్టాయన్నారు.

సర్వోదయ, నవోదయ

పాలన ఇది : సీఎం

బనశంకరి: జనప్రియ పథకాలకంటే జనపర కార్యక్రమాలు అందించడం తమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి బసవరాజబొమ్మై తెలిపారు. మంగళవారం ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపుర నెహ్రూ మైదానంలో రూ.59 కోట్ల వ్యయమయ్యే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వంతో సర్వోదయ, నవోదయ పాలన సాగుతోందని, పలు రంగాల్లో కర్ణాటక దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కోటే శ్రీనివాసపూజారి మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వ్యక్తికి సామాజిక న్యాయంతో పాటు సౌలభ్యాలు కల్పించామన్నారు. జలవనరుల శాఖామంత్రి గోవిందకారజోళ, శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వరహెగ్డే కాగేరి, విధాన పరిషత్‌ సభాపతి బసవరాజహొరట్టి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement