లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం | - | Sakshi
Sakshi News home page

లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం

May 19 2026 11:47 PM | Updated on May 19 2026 11:47 PM

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు

కలెక్టర్‌, చైర్మన్‌ చిత్రా మిశ్రా

పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌

కరీంనగర్‌/కరీంనగర్‌ అర్బన్‌: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లాస్థాయి మల్టీ మెంబర్‌ అప్రోప్రియేట్‌ అథారిటీ సమావేశం చైర్మన్‌, కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్‌ చిత్రామిశ్రా మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్‌ సెంటర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వైద్య బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, అవసరమైతే పోలీసుశాఖ సహకారం తీసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌ మాట్లాడుతూ భ్రూణహత్యలను పూర్తిగా నివారించడంతో పాటు ఆడపిల్లల విషయంలో వివక్షను తగ్గించి, మహిళల హక్కులను పరిరక్షించే దిశగా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. డీసీపీ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, పీసీపీఎన్‌డీటీ ప్రోగ్రాం ఆఫీసర్‌ సనా, ప్రకృతి, ప్రశాంతి, భువన పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తరలించిన ధాన్యం మిల్లుల్లో సత్వరమే అన్‌లోడింగ్‌ చేయాలన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో కె.మహేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల డీఎం రజనీకాంత్‌, సహకార అధికారి రామానుజచార్యులు, డీఆర్డీవో గీత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement