సలుపుతున్న రాచపుండు! | - | Sakshi
Sakshi News home page

సలుపుతున్న రాచపుండు!

May 19 2026 11:47 PM | Updated on May 19 2026 11:47 PM

సదాశివపల్లిలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కేన్సర్‌ స్క్రీనింగ్‌

మరో ఇద్దరికి వ్యాధి నిర్ధారణ

గ్రామస్తులందరికీ పరీక్షలు చేస్తే.. బయటపడనున్న మరిన్ని కేసులు

శిబిరాన్ని పర్యవేక్షించిన జిల్లా వైద్యాధికారి వెంకటరమణ

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ శివారులోని సదాశివపల్లిలో రెండు దశాబ్దాలుగా కేన్సర్‌ భయాందోళనకు గురిచేస్తోంది. పదేళ్ల వ్యవధిలో గ్రామంలో 25 మందికిపైగా కేన్సర్‌తో మృతి చెందిన ఘటనలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రైస్‌ మిల్లుల కారణంగా గాలి, భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. అంతుచిక్కని మరణాలపై ‘సాక్షి’లో ‘సదాశివపల్లికి ఏమైంది?’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్యశాఖ స్పందించింది. డీఎంహెచ్‌వో వెంకటరమణ హుటాహుటిన వైద్యశిభిరం ఏర్పాట్లు చేశారు. అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హౌజింగ్‌బోర్డు పరిధిలోని సదాశివపల్లిలో కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రారంభ దశలోనే కేన్సర్‌ను గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, అందుకే స్క్రీనింగ్‌ పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని డీఎంహెచ్‌వో సూచించారు.

సలుపుతున్న రాచపుండు

సదాశివపల్లిని కేన్సర్‌ రూపంలో రాచపుండు సలుపుతోంది. ఇప్పటికే 25 మంది వరకు మృత్యువాతపడగా, వైద్యశిబిరంలో మరో రెండు కేసులు బయటపడ్డాయి. పరీక్షల్లో 27 మందికి బీపీ, 14 మందికి షుగర్‌ లక్షణాలు ఉన్నట్లు తేలింది. గ్రామ ప్రజలందరికీ సమగ్ర పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని కేసులు బయటపడే అవకాశముందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. 14ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందించారు. కేన్సర్‌ నివారణ చర్యలు, జీవనశైలి మార్పులు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. డాక్టర్లు ఉమాశ్రీ, విప్లవశ్రీ, రాజ్‌కుమార్‌, పోచయ్య, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

అనుమానితులందరికీ వైద్య పరీక్షలు

సదాశివపల్లిలో అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టాం. మంగళవారం నిర్వహించిన వైద్య శిభిరంలో ఇద్దరికి కేన్సర్‌ నిర్ధారణ అయింది. పరీక్షలు రెగ్యులర్‌గా నిర్వహించి ఇంకా ఎవరికై నా వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందిస్తాం. గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సేవలు చేపడతాం.

– డాక్టర్‌ వెంకటరమణ, డీఎంహెచ్‌వో

Advertisement
 
Advertisement
Advertisement