హోటళ్లు, లాడ్జీలపై నిఘా పెంచాం | - | Sakshi
Sakshi News home page

హోటళ్లు, లాడ్జీలపై నిఘా పెంచాం

May 19 2026 11:47 PM | Updated on May 19 2026 11:47 PM

● సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌క్రైం: నగరంలో ఇటీవల జరిగిన పీఎంజే జువెల్లరీ దోపిడీని దృష్టిలో పెట్టుకొని కమిషనరేట్‌ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో మంగళవారం సీపీ గౌస్‌ ఆలం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయుధాలతో కూడిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్‌ కార్డులు, తప్పుడు ఫోన్‌ నంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చి నగరంలోని పలు హోటళ్లలో దాదాపు రెండు నెలల పాటు బస చేసినట్లు విచారణలో తేలిందన్నారు. హోటల్‌, లాడ్జీల్లో రూంలు కేటాయించే ముందు ప్రభుత్వ గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కస్టమర్లు ఇచ్చే మొబైల్‌ నంబర్‌ పనిచేస్తుందో లేదో క్రాస్‌ చెక్‌ చేసుకోవాలన్నారు. భారీ నగదు లావాదేవీలు చేసే వారి వివరాలను పోలీసులకు చేరవేయాలన్నారు. ప్రతీ లాడ్జీ, హోటల్‌పై నిఘా పెంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, తిరుమల్‌ పాల్గొన్నారు.

చెక్‌పోస్టుల తనిఖీ

బక్రీద్‌ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరి కట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సీపీ గౌస్‌ ఆలం మంగళవారం తనిఖీ చేశారు. కొత్తపల్లి మండలం చింతకుంట, గంగాధర మండలం తుర్కాసినగర్‌, చొప్పదండి మండలంలోని ఆర్నకొండ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తనిఖీ రిజిష్టర్లను పరిశీలించి, ప్రతీ వాహనం వివరాలను నమోదు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరును గమనించారు. శిక్షణ ఐపీఎస్‌ సోహం సునీల్‌, రూరల్‌ ఏసీపీ విజయకుమార్‌, సీఐలు బిల్లా కోటేశ్వర్‌, ప్రదీప్‌ కుమార్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

సీపీకి అభినందనలు

పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసును 11 రోజుల్లో ఛేదించిన సీపీ గౌస్‌ ఆలం, పోలీసు బృందానికి జిల్లా కాంగ్రెస్‌ బీసీ సెల్‌ చైర్మన్‌ పులి ఆంజనేయులు గౌడ్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌ రెడ్డి, తాడిజెర్రి సర్పంచ్‌ రామిడి రాజిరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement