● బస్తాలు తరలించరు.. గన్నీలు ఇవ్వరు ● మక్కల కొనుగోళ్లలో ఇదేం నిర్లక్ష్యం? | - | Sakshi
Sakshi News home page

● బస్తాలు తరలించరు.. గన్నీలు ఇవ్వరు ● మక్కల కొనుగోళ్లలో ఇదేం నిర్లక్ష్యం?

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

● బస్తాలు తరలించరు.. గన్నీలు ఇవ్వరు ● మక్కల కొనుగోళ్లలో ఇదేం నిర్లక్ష్యం?

కరీంనగర్‌ అర్బన్‌: ఆరుగాలం కష్టించిన అన్నదాత కు మార్కెట్‌లోనూ నిత్య రణరంగమే అవుతోంది. పంట పండించడం ఒక ఎత్తయితే పంటను విక్రయించడం మరో ఎత్తవుతోంది. అధికారుల ప్రణా ళిక లేమి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో పక్షం రోజులుగా పంటను విక్రయించేందుకు పడిగాపులు కాస్తుండటం అన్నదాత వంతవుతోంది. కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌లో డీసీఎంఎస్‌ మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటం కలవరానికి గురి చేస్తోంది.

ఎటూ చూసిన మక్కల కుప్పలే

మార్క్‌ఫెడ్‌ మక్కల కొనుగోళ్లను పర్యవేక్షిస్తుండగా అధికారులు నిర్వహణను గాలికొదిలేశారు. మక్కల కుప్పలతో మార్కెట్‌ నిండిపోగా గన్నీలు ఇచ్చింది లేదు.. కాంటా పెట్టింది లేదు. పెడితే తరలించేదే ఉండదు. కరీంనగర్‌ రూరల్‌ మండలంతో పాటు తిమ్మాపూర్‌, కొత్తపల్లి మండలాల రైతులు మక్కలను ఎక్కువ మొత్తంలో తీసుకురాగా కొనుగోళ్లు జాప్యం అవుతున్నాయి.

ఇవేం నిబంధనలు

మక్కల కొనుగోళ్లలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలు విధించడం రైతులకు తీవ్ర ఇబ్బందిగా మా రింది. ఎకరానికి 40క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా మారింది. ఇక విక్రయించే వారిలో కౌలు రైతులుండగా అసలు రైతులు హైదరాబాద్‌, ఇతర పట్టణాల్లో ఉంటుండగా వేలిముద్ర వేసేందుకు రావడం కష్టమే. పలువురి వేలిముద్రలు రాకపోగా ఐరిస్‌ వంటి ఆప్షన్‌ లేదు. ఇక ప్రధానంగా పంటల వివరాల నమోదులో అప్పటి ఏఈవోలు సరిగా వివరాలు నమోదు చేయలేదని స్పష్టమవుతోంది. ఇదిలాఉండగా మక్కల కొనుగోళ్లు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటామని కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఆకుల నర్సన్న స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, కొనుగోలు చేసిన పంటను తక్షణమే తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement