అది వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే రహదారి. ఏమైందో ఏమో. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. ఒక్కరు మాత్రమే కొన ఊపిరితో చావుబతుకుల్లో ఉన్నారు. వేసవి సెలవుల్లో ముగ్గురు చిన్నారుల చిరునవ్వులు చెదిరిపోయాయి. అమ్మానాన్నలతో కలిసి సరదాగా వెళ్లి ఆ పసి హృదయాలు రోడ్డు ప్రమాదంలో ఆగిపోయాయి. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగు రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మరణించడం విషాదం నింపింది.
● హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల వాసుల మృతి
● ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
● అందులో ముగ్గురు పిల్లలు
● చిన్న కారు.. పెద్ద ప్రమాదం
సిరిసిల్ల: సిరిసిల్లలోని సర్ధార్‌నగర్‌కు చెందిన బొల్లి శివకుమార్‌కు వ్యాగనార్(టీఎస్23ఎఫ్2298) కారు ఉంది. అందులో అతడి భార్య బొల్లి లాస్య, కూతు రు బొల్లి రిషిత, బావ కోడం శ్రీనివాస్(ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్, వేములవాడ), చెల్లెలు శ్వేత(ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది), అల్లుళ్లు కోడం కృష్ణచంద్ర, కోడం మాధవ్‌తో కలిసి ఆలయానికి వెళ్లి వస్తుండగా.. అతివేగంగా వెళ్తూ శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డులో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. కోడం శ్వేత కొన ఊపిరితో ఉన్నారు. ఆమెను కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్న కారు పెద్ద ప్రమాదానికి కారణమైంది.
ఇంటికి తాళం వేసి..
సిరిసిల్లకు చెందిన బొల్లి రాజు బీడీ కంపెనీ టేకేదార్. సర్ధార్‌నగర్‌లో నివాసముండే రాజు–భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు శివకుమార్, శిరీష్, ఒక కుమార్తె శ్వేత. ప్రమాదంలో కొడుకు, అల్లుడు, కోడలు, వాళ్ల ముగ్గురు పిల్లలు మరణించగా.. కూతురు శ్వేత చావుబతుకుల్లో ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంతో సిరిసిల్లలో విషాదం అలుముకుంది. ప్రమాద ఘటన సమాచారం తెలియగానే బొల్లి రాజు కుటుంబం ఇంటికి తాళం వేసి హుటాహుటిన హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
చివరి సెల్ఫీలో మృతులు ఆరుగురు..
సరదాగా నవ్వుతూ ఆ రెండు కుటుంబాలు ఎంతో ఉల్లాసంగా తీసుకున్న ఆ సెల్ఫీ చివరిదైంది. ఏడుగురు తీసుకున్న సెల్ఫీలోని ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆ ఫొటోలోని ఆరుగురు విగత జీవులు కాగా.. ఓఆర్‌ఆర్‌పై శవాలను ఉంచడం సిరిసిల్ల వాసులను ఆవేదనకు గురి చేసింది. ఆఖరు సెల్ఫీలో ఉన్న వారిలో ఒక్క శ్వేత తప్ప అందరూ మరణించడం బాధాకరం.
హైదరాబాద్ తరలిన ఆత్మీయులు
రెండు కుటుంబాలకు చెందిన ఆత్మీయులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. శవాలు గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉండగా.. శ్వేత కిమ్స్ ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉంది. సిరిసిల్లకు చెందిన పలువురు హైదరాబాద్ తరలివెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్‌లో బొల్లి రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.


