‘గ్రానైట్‌’ ఆగడాలకు అడ్డేది..? | - | Sakshi
Sakshi News home page

‘గ్రానైట్‌’ ఆగడాలకు అడ్డేది..?

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

‘గ్రానైట్‌’ ఆగడాలకు అడ్డేది..?

పట్టించుకునే వారేరి?

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కొత్తపల్లి:

గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ ఇండస్ట్రీస్‌ యూనిట్ల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే పరిశ్రమలపై ‘ప్రేమ’ ఒలకబోస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. అధికారుల కనుసన్నల్లోనే అన్నీ జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సామాన్యుడిపై విరుచుపడే అధికారగణం బడాబాబుల ఆగడాలను అడ్డుకోలేకపోతోంది. పల్లె ప్రజలు అవస్థలు పడుతుంటే.. కనీస బాధ్యత మరిచిన పరిశ్రమలు మాత్రం తమ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. అధికారుల అలసత్వం.. రాజకీయ అండదండలతో అవినీతి సామ్రాజ్యాన్ని విస్తురించుకుంటున్నారు. గ్రానైట్‌ పరిశ్రమల అక్రమ లీలలన్నింటినీ చూసుకుంటానన్న ‘ఆయన’ ఎవరూ.. ఆ బడా నేతను బదనాం చేస్తున్న బాద్‌షా ఎవరనే అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

350 పైగా గ్రానైట్‌ పరిశ్రమలు

కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, బద్ధిపల్లి, ఖాజీపూర్‌, ఎలగందుల, శ్రీరాములపల్లి, కమాన్‌పూర్‌, నాగులమల్యాల, గంగాధర మండలం ఒద్యారంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానైట్‌ కటింగ్‌ పరిశ్రమలు నడుస్తున్నాయి. సుమారు 350 పైగా గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే పరిశ్రమల వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పరిశ్రమల వ్యర్థాల మూలంగా పల్లెల్లో పర్యావరణం దెబ్బతింటోంది. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయినా అధికారులు అటువైపు చూడకపోగా..గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు మాత్రం కనీస బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారు. దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా పట్టించుకున్న పాపాన పోవడంలేదు. గ్రానైట్‌ స్లర్రీ మూలంగా కలుషితమవుతున్న భూగర్భ జలాల వల్ల స్థానికులు అనారోగ్యాల బారిన పడకుండా శుద్ధమైన నీటిని అందించే ప్రయత్నాలు చేయాల్సి ఉండగా అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. రోడ్లపై దుమ్ము లేవకుండా నీటిని చల్లాలి. కానీ, ఇవేవీ ఈ పారిశ్రామిక ప్రాంతంలో అమలు కావడంలేదు. స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు మాత్రమే మొక్కుబడిగా నివారణ చర్యలు చేపడుతున్నట్లు నటిస్తూ వదిలేస్తున్నారు. గ్రానైట్‌ పరిశ్రమల వల్ల కలుగుతున్న అనర్థాలను అధికారులకు ప్రజలు విన్నవిస్తున్నా వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. గ్రానైట్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులకెందుకంత ‘ప్రేమ’

గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా అధికారులెందుకు ‘ప్రేమ’ ఒలకబోస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అనుమతుల్లేకున్నా, పన్నులు కట్టకున్నా గ్రామ పంచాయతీ పట్టించుకోదు. గ్రానైట్‌ బ్లాక్‌ దందా, అక్రమ రవాణాపై కమర్షియల్‌ టాక్స్‌, రవాణా శాఖ, గ్రానైట్‌ వ్యర్థాల (స్లర్రీ) నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చూసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి, నీటి కలుషితమవుతుంటే భూగర్భ జలశాఖ, కార్మికుల బాగోగులు చూడాల్సిన కార్మిక శాఖ, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమిస్తే చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ శాఖలు కన్నెత్తి చూడకపోగా..ఇక గ్రానైట్‌ పరిశ్రమల ఆగడాలెలా ఆగతాయన్న ప్రశ్న తలెత్తకమానదు. ఇంతా జరుగుతున్నా జిల్లా యంత్రాంగం గమ్మునుండటం ప్రజలకు మింగుడుపడడం లేదు. ఇక ఎవరికి చెప్పుకోవాలన్న ఆత్మపరిశీలనలో పడ్డారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి గ్రానైట్‌ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.

చూసుకుంటానన్న ‘ఆయనెవరు’..

గ్రానైట్‌ పరిశ్రమలతో స్థానిక ప్రజలు నరకాన్ని చూస్తుంటే, కనీస నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న మాఫియా పరిశ్రమల ఆగడాలను ‘ఆయనే’ చూసుకుంటారంటూ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పరిశ్రమలపై ఈగ వాలినా ఆ బడా నేత ఊరుకోరంటూ బదనాం చేస్తున్న బాద్‌షా ఎవరనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో గ్రానైట్‌ పరిశ్రమల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. మానవత్వం మరిచి పల్లెల్లో విధ్వంసం సృష్టిస్తూ ఆధిపత్యం కొనసాగిస్తున్న పరిశ్రమలపై ఆ బడా నేత స్పందనపై ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ బడా నేత చూపు ప్రజలవైపా..అక్రమార్కుల వైపా అన్న సందేహాలు నెలకొంటున్నాయి.

గ్రానైట్‌ పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యాన్ని చిమ్ముతుంటే అధికారులెవ్వరూ స్ప ందించడం లేదు. అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లే దు. గ్రానైట్‌ పరిశ్రమలు ఉన్న ఖాజీపూర్‌కు స్లర్రీ రవాణా వాహనాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. గ్రానైట్‌ అసోసియేషన్‌ చెప్పిందే నడవాల్సి న దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి గ్రా నైట్‌ పరిశ్రమల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి.

– సోమినేని తిరుపతి, ఖాజీపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement