ఉపాధిహామీ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ కూలీ మృతి

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేటలో ఉపాధిహామీ పనుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తకొండ దేవవ్వ(53) అనే ఒంటరి మహిళ సోమవారం ఉపాధిహామీ పని చేస్తుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పి కుప్పకూలింది. సహచర కార్మికులు గమనించి వెంటనే సిరిసిల్లలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దేవవ్వను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఒంటరి మహిళ దేవవ్వ ఉపాధిహామీ పనులు చేస్తూ కాలం వెల్లదీస్తుంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఏపీడీ నర్సింహులు, ఏపీవో శ్రీనివాస్‌ పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అనుమానాస్పదంగా వృద్ధురాలు..

సైదాపూర్‌: కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం ఎలబోతారంలో నూనె వెంకటమ్మ(75) అనే వృద్ధురాలు ఆదివారం వ్యవసాయబావిలో పడి అనుమానాస్పదంగా మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. వెంకటమ్మ కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. నడవలేని స్థితిలో ఉన్న వెంకటమ్మ గ్రామ సమీపంలోని వ్యవసాయబావిలో మృతిచెంది ఉంది. ఇంట్లో కనిపించడం లేదని బంధువులు, గ్రామస్తులు పలువురి వ్యవసాయ బావుల్లో గాలించారు. ఆచూకీ లభించలేదు. అనుమానంతో ఒక వ్యవసాయ బావిలోని నీటిని మోటార్‌ ద్వారా తోడించారు. ఇంతలో దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో వృద్ధురాలు శవం లభించింది. నడవలేని స్థిలో ఉన్న వెంకటమ్మ బావి వద్దకు ఎలా వెళ్లిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై స్వాతి పరిశీలించారు. మృతురాలి భర్త గతంలోనే మృతిచెందగా, ఒక కూతురు, నలుగురు కుమారులు ఉన్నారు.

రైలు ఢీకొని వలసకూలీ ..

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్‌ రైల్వేస్టేషన్‌లో ఆదివారం రాత్రి రైలు ఢీకొని మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భార్వని జిల్లా బాల్ఖడ్‌ఘూటి గ్రామానికి చెందిన రాహుల్‌(23) మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం జీఆర్పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ తిరుపతి కథనం ప్రకారం.. కాంట్రాక్టు కూలీగా పనిచేయడం కోసం తల్లి సూలిబాయితో కలిసి రాహుల్‌ ఇటీవల కొలనూర్‌కు వచ్చాడు. రైల్వేస్టేషన్‌ సమీపంలో గుడిసేలో నివసిస్తున్నాడు. ఆదివారం తన తల్లివద్ద రూ.500 తీసుకున్నాడు. అనంతరం మద్యం మత్తులో ప్లాట్‌ఫామ్‌ దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తల పగిలి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొన్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

మెట్ల పైనుంచి పడి వ్యక్తి ..

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లె గ్రామానికి చెందిన పెనుకుల కొమురయ్య(54) మెట్ల పైనుంచిపడి మృతి చెందాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్‌ కథనం ప్రకారం.. కొమురయ్య మెట్ల పైనుంచి కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తలకు గాయమైంది. వెంటనే పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. మృతుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసున మోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు.

గుండెపోటుతో బాలుడు..

జగిత్యాలక్రైం: జగిత్యాల మండలం పొరండ్ల గ్రామానికి చెందిన తోపారపు నిషాంత్‌ (9) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. చంద్రశేఖర్‌, నవిత దంపతుల కుమారుడు నిషాంత్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. వారి వ్యవసాయ పొలం వద్దనున్న శివాలయంలో అన్నదానం చేస్తుండగా నిషాంత్‌కు ఫిట్స్‌ వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో గుండెపోటు రావడంతో మృతిచెందాడు.

కర్ణాటక వాటర్‌ ఫాల్స్‌లో యువకుడు..

కోరుట్ల: కర్ణాటకలోని అంకోలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విభూత వాటర్‌ ఫాల్స్‌లో ప్రమాదవశాత్తు పడి కోరుట్ల మున్సిపల్‌ వీలిన గ్రామం ఎఖీన్‌పూర్‌కు చెందిన శీలం అజయ్‌గౌడ్‌(25) మృతిచెందాడు. వివరాలు.. ఎఖీన్‌పూర్‌కు చెందిన శీలం వెంకటేశ్‌–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు అజయ్‌గౌడ్‌ 15 రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చాడు. ఆదివారం సరదాగా హైదరాబాద్‌లో ఉండే ఇద్దరు స్నేహితులతో కలిసి కర్ణాటక టూర్‌ వెళ్లాడు. సోమవారం ఉదయం అంకోలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విభూత వాటర్‌ ఫాల్స్‌లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో ఉన్న రాయి తాకి శ్వాస ఆడక మృతిచెందినట్లు సమాచారం. ఆయన వెంట ఉన్న స్నేహితులు ఆజయ్‌గౌడ్‌కు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. సోమవారం సాయంత్రం కర్ణాటక వెళ్లారు. అంకోలా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement