కరీంనగర్ కార్పొరేషన్: ప్రభుత్వశాఖల్లోని అతి ప్రధాన ఉద్యోగ ‘వ్యవస్థ’ అది. జిల్లా అధికార యంత్రాంగాన్నే శాసించే సంఘం నేతల కనుసన్నల్లో నడుస్తున్న ‘వ్యాపారం’ అది. కేవలం ఆదాయం తప్ప ‘పన్నుల’ ఖర్చు లేని దందా అది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన రెవెన్యూశాఖ ఉద్యోగసంఘాలే బల్దియా ఆదాయానికి గండికొడుతున్నా రు. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ దుకాణ సముదాయ ఆస్తి పన్ను బకాయిలపై కథనం.
ఏటా అదే తంతు...
కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ దుకాణ సముదా యానికి సంబంధించిన రూ.లక్షల ఆస్తి పన్ను బకా యిలు చెల్లించకపోవడం ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణసముదాయం, ఫంక్షన్‌హాల్, క్లబ్‌లు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సంవత్సరాలు గా రూ.లక్షల ఆిస్తిపన్ను చెల్లించకుండా, ఏటా ఏదో ఒక సాకు చెప్పి గడుపుతుండడం అలవాటుగా మా రింది. గతేడాది కూడా నగరపాలకసంస్థ ఆస్తి పన్ను వసూళ్లలో భాగంగా రెవెన్యూ దుకాణసముదాయాలపై ఒత్తిడి పెంచింది. కాని కంటితుడుపుగా రూ.2 లక్షలు చెల్లించి ఆ ఆర్థిక సంవత్సరాన్ని దాటవేసిన ట్లు సమాచారం. ఈ ఏడాది రూ.75 లక్షలు చెల్లించా ల్సి ఉండగా, కొంతమేర చెల్లిస్తామని ఉన్నతాధికారులకు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం.
కిరాయిదారుల నుంచి వసూళ్లు
ఆస్తిపన్ను లక్షల రూపాయల్లో బకాయి పడ్డ రెవెన్యూ దుకాణసముదాయంపై నగరపాలకసంస్థ చర్యలకు దిగితే, కిరాయదారులే ఇబ్బంది పడుతుండడం సమస్యగా మారింది. దుకాణసముదాయాలను అద్దెకివ్వగా, క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తూ వస్తున్నారు.అద్దె వసూలు చేస్తున్నా, ఆ షాప్‌లకు సంబంధించిన ఆస్తి పన్ను మాత్రం నిర్వాహకులు చెల్లించడం లేదు. దీంతో గతేడాది దుకాణాలకు బల్దియా అధికారులు తాళం వేశారు. కాని దుకాణాలు మూసివేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, పెద్దలకు ఎలాంటి ఇబ్బంది లేదని కిరాయిదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది.
కమర్షియల్ ఉంటే మినహాయింపు లేదు
ఆస్తి పన్ను నుంచి తమకు మినహాయింపు ఉంటుందని చెబుతున్నా, వాస్తవ పరిస్థితిలో అలాంటిది ఉండకపోవచ్చని ఉద్యోగ సంఘాల సీనియర్ నేతలే చెబుతున్నారు. సొసైటీ భవనాలు, సముదాయాలను వాణిజ్యపరంగా వినియోగించుకొంటే పన్ను మినహాయింపు ఉండదంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నగరపాలకసంస్థ అధికారులు చెబుతున్నారు.
నోరెత్తిన అధికారులు
పలుకుబడి కలిగిన ఉద్యోగసంఘాల నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణ సముదాయాల బకాయిలపై నగరపాలకసంస్థ అధికారులు నోరెత్తడం లేదు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంపై మీడియాలో కథనాలు వస్తుండడంపై ఉన్నతస్థాయిలో బల్దియా అధికారులపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. బకాయిల వివరాలు చెప్పడం వల్లే కథనాలు వస్తున్నాయని, నోరెత్తవద్దంటూ వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు బల్దియా అధికారులు మీడియా ప్రతినిధుల ఫోన్లకు స్పందించడం మానేశారు.


