కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గొర్రెలకు స్నానం చేయించేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు గొర్లకాపరులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. ధర్మారం గ్రామానికి చెందిన గొర్లకాపరులు ముడికె లక్ష్మీరాజం(65), కుమ్మం మొండయ్య(55) రోజు మాదిరిగానే తమ గొర్రెలమందతో కలిసి గ్రామ శివారులోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గొర్రెలను నీటిలోకి దింపి స్నానం చేయిస్తున్నారు. ఈక్రమంలో లక్ష్మీరాజం చెరువులో జారిపడి బురదలో ఇరుక్కుపోయాడు. ఈత వచ్చినా బురదలో ఈదలేక ఇబ్బందులు పడుతున్నాడు. గమనించిన మొండయ్య వెంటనే చెరువులో దిగి లక్ష్మీరాజంను కాపాడే ప్రయత్నం చేశాడు, లక్ష్మీరాజం మొండయ్య మెడపై గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు బురదలోకి జారి గల్లంతయ్యారు.
ఈతగాళ్లసాయంతో వెలికితీత
ఇద్దరు గొర్లకాపరులు నీటిలోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గల్లంతుకాగా ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. లక్ష్మీరాజంకు భార్య లక్ష్మి, కుమారుడు పర్శరాములు, కూతురు జ్యోతి ఉన్నారు. మొండయ్యకు భర్యా మంగవ్వ, కుమారులు ప్రశాంత్, వినయ్, వంశీ ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
లక్ష్మీరాజం, మొండయ్య మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం


