కరీంనగర్ కార్పొరేషన్: తనను నమ్ముకున్నోళ్లకు మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి చేసిందేమిటని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం నిలదీశారు. కాంగ్రెస్ అంటే కేవలం ఆయన కుటుంబమేనా, కార్యకర్తల ఎదుగుదలకు ఏనాడైనా ప్రయత్నించారా అంటూ మండిపడ్డారు. ఆదివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 42 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ 14 సార్లు ఎమ్మెల్యే టికెట్, మూడు సార్లు ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు రెండు సార్లు మంత్రిని చేసిందన్నారు. కాని జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు చేసిందేమిటన్నారు. తనను నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు ఎప్పుడైనా జీవన్ రెడ్డి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఇప్పించారా అన్నారు. రాజకీయ జీవితంలో తనవెంట ఉన్న బీసీలకు, ఎస్సీలకు, వైశ్యులకు ఎవరికై నా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారో చెప్పాలన్నారు. 2018లో తనకు టికెట్ అవకాశం వస్తే, రాజీనామా చేస్తానని బెదిరించి అడ్డుకొన్నది జీవన్‌రెడ్డి అని ఆరోపించారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా జీవన్‌రెడ్డికే పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. అవకాశం వస్తే తన తమ్ముళ్లకు పదవులు ఇప్పించుకొన్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వల్లనే కాంగ్రెస్ వేవ్ వచ్చిందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు సముద్రాల అజయ్, గడ్డం నాగరాజు, సుద్దాల లక్ష్మణ్, ఆవాల లత, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అంటే ఆయన కుటుంబమేనా?
పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఫైర్


