రూ.50 కోట్ల టెండర్లు రద్దు! | - | Sakshi
Sakshi News home page

రూ.50 కోట్ల టెండర్లు రద్దు!

Mar 27 2026 9:22 AM | Updated on Mar 27 2026 9:22 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలో రూ.50 కోట్ల టెండర్లు రద్దయ్యాయి. ప్రత్యేక అధికారి పాలనలో రూ.50 కోట్లతో చేపట్టనున్న 87 పనుల టెండర్‌పై పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నీలినీడలు కమ్ముకొన్నాయి. పనుల్లో అంచనాలు భారీగా పెంచారని, ప్రజలు కోరుకొన్నచోట కాకుండా అనవసర ప్రాంతాల్లో పెట్టారంటూ కొత్తగా ఎన్నికై న కార్పొరేటర్లు తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో పాత టెండర్లు రద్దు కావడం రాజకీయంగా దుమారం రేపుతుండగా,అధికారులు మాత్రం టెండర్లురద్దుపై స్పష్టత ఇవ్వడం లేదు.

టెండర్‌ రద్దు

మున్సిపల్‌ ఎన్నికలకు ముందు యూఐడీఎఫ్‌ (అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలెప్‌మెంట్‌ ఫండ్‌) కింద నగరంలో రూ.50 కోట్లు కేటాయించారు. రూ.50 కోట్ల తో 87 పనులు చేపట్టేం దుకు గతేడాది అక్టోబర్‌ 25వ తేదీన జీవో నంబర్‌ 715 ద్వారా సీడీఎంఏ పరిపాలనా మంజూరు ఇచ్చింది. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ వాటా రూ.40 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.10 కోట్లు. 87 పనులకు సంబంధించి టెండర్‌ పిలిచారు . పనుల్లో 25 పనులకు ఎవరూ బిడ్‌ దాఖలు చేయ లేదు. 62 పనులకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన లభించింది. ఇందులో 21 పనులకు టెండర్‌ ఓపెన్‌ చేశారు. మిగితా 41 బిడ్లను ఓపెన్‌ చేయాల్సి ఉండగా,నగరపాలకసంస్థ ఎన్నికలు రావడం, పాలకవర్గం ఏర్పడడంతో పునరాలోచన పడింది.

66 డివిజన్లకు కేటాయింపు!

రూ. 50 కోట్ల టెండర్‌ రద్దు చేయగా, ఈ నిధులను 66 డివిజన్‌ లకు కేటాయించేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.ఒక్కో డివిజన్‌ కు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి విలువైన పనులకు స్థానిక కార్పొరేటర్ల నుంచి ప్రతి పాదనలు తీసుకొంటున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే టెండర్ల రద్దు రాజకీయ దుమారానికి కారణమైంది. కాగా టెండర్ల రద్దుపై అధికారులు స్పందించడం లేదు.

31 న బల్దియా బడ్జెట్‌ సమావేశం

నగర పాలక సంస్థ బడ్జెట్‌ ప్రత్యేక సమావేశం ఈ నెల 31 వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగియనుండడంతో వార్షిక బడ్జెట్‌ సమావేశం అనివార్యమయింది. ఇప్పటికే ఎజెండా కాపీలు సభ్యులకు అందచేసినట్లు సమాచారం.

66 డివిజన్లకు కేటాయింపు?

కమీషన్ల కోసమే రద్దు చేశారు

కమీషన్ల కోసమే బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి నగరపాలకసంస్థలో రూ.50 కోట్ల టెండర్లను రద్దుచేశాయని మాజీ మేయర్‌, 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌ ఆరోపించారు. గురువారం నగరంలోని తారక హోటల్‌లో మాట్లాడుతూ ప్రత్యేకాధికా రి పాలనలో రూ.50 కోట్లతో 87 పనులు చేపట్టేందుకు టెండర్‌ పిలిచారన్నారు. విలీన ప్రాంతాలకు పనుల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ, పరిపాలనా మంజూరు ఇస్తూ సీడీఎంఏ జీఓ 715 జారీచేశారని తెలిపారు. పాలకవర్గం ఏర్పడ్డాక మరిన్ని నిధులు తీసుకురావాల్సింది పోయి, పాత రూ.50 కోట్ల టెండర్‌ను బుధవారం రాత్రికి రాత్రే రద్దు చేశారన్నారు. రూ.50 కోట్ల టెండర్లను ఎందుకు రద్దు చేశారో బండి సంజయ్‌, పొన్నం ప్రభాకర్‌ చెప్పాలన్నారు. వారికి తెలియకపోతే మంత్రి పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఏ ప్రాతిపదికన టెండర్లురద్దు చేశారో, కలెక్టర్‌, కమిషనర్‌ చెప్పాలన్నారు. బీజేపీ నాయకుల బంధువులకు టెండర్‌ అప్పగించేందుకే పాత టెండర్‌ రద్దు చేశారన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement