ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహకాలనీ గేటెడ్ కమ్యూనిటీ వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన బత్తుల రాజయ్య(58) సైకిల్‌పై ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా.. వెనకాల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రాజయ్య గొర్లు, మేకలకు మందుల కోసం ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, నెల క్రితం దుమాల గ్రామానికి చెందిన ఒకరు ద్విచక్ర వాహనంపై సెకండ్ బైపాస్‌కు టర్న్ అవుతుండగా బస్సు ఢీకొని మృతిచెందిన ఘటన మరువక ముందే.. మరో ప్రమాదం జరిగింది. దీంతో వాహనదారులు ఆందోళనకు గురువుతున్నారు. గతేడాది రాజయ్య కుమారుడు సైతం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.


