‘చేప’డితే లాభమే
వీణవంక(హుజూరాబాద్): మత్స్యకారులు చెరువుల్లో చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నారు. కొంత మంది చెరువులను లీజుకు తీసుకొని చేపల పెంపకం చేపడుతూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గత వానాకాలం సీజన్‌లో చెరువులు, కుంటల్లో పోసిన చేప పిల్లలు ఇప్పుడు పట్టే దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గుతోంది. దీంతో మత్స్యకారులు చేపలు పట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే చేపలు పడుతున్నారు. అయితే చేపల పెంపకం ఒక ఎత్తయితే వాటిని పట్టే దశలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే సమయంలో మూడునాలుగు రోజులు రవాణా చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో చేపలు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కరీంనగర్ జిల్లాలో 450 చెరువులు, కుంటలు ఉన్నట్టుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీణవంక, శంకరపట్నం, మానకొండూరు మండలాలతో పాటు పెద్దపల్లి జిల్లాలో కూడా చేపల పెంపకం ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వారం రోజుల నుంచి చేపలు పడుతున్నారు. ఒక్కో చేప రెండున్నర కిలోల నుంచి 3కిలోల వరకు పెరిగింది. మార్కెట్లో రవ్వు చేప కిలో ధర రూ.150 పలుకుతోంది. అదే వ్యాపారులకై తే కిలోకు రూ.90 విక్రయిస్తున్నారు. బొమ్మె చేప కిలో రూ.350 ఉంది. ఈసారి చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరు ఉండగా, చేపల వృద్ధి కూడా బాగా పెరిగింది.
చేపల పెంపకంపై ఆసక్తి కనబర్చుతున్న మత్స్యకారులు
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
నీటిమట్టం తగ్గుతుండడంతో చేపలు పట్టే బిజీలో మత్స్యకారులు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చేపలు పట్టేందుకు ఆరు రోజుల ముందు నుంచే మేత అందించడం నిలిపివేయాలి. చేపల పొట్టలో మేత ఉండగా పట్టుకుంటే రవాణా సమయంలో అవి కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
ఎస్సారెస్పీ నీటిని పుష్కలంగా విడుదల చేయడంతో చెరువులు, కుంటలు ఈసారి కళకళలాడాయి. చేపలు కూడా వృద్ధి చెందాయి. ప్రస్తుతం ఒక్కో చేప 2 కిలోల పైనే ఉంది. రవ్వు, గండె, గ్యాస్‌కట్ వంటి రకాలను ఎక్కువగా పెంచుతున్నారు. జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. రవాణా సమయంలో చేపలు కుళ్లి పోకుండా వాటిని పట్టిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాల్లో మూడు పొరలుగా వేసుకొని చేప పొరల మధ్య ఐస్ వేయాలి.
చేప కనీసం కిలోపైగా బరువు ఉంటేనే మంచిది. అంత కంటే తక్కువ బరువు ఉంటే చెరువులోకి వదిలివేయాలి.
రవ్వు చేప నీటి నుంచి తీసిన 2నిమిషాల వరకే బతుకుతుంది. కావున వెంటనే నీటిలో వేయడం వల్ల చేప గట్టిపడకుండా ఉంటుంది. లేందటే ఐసులో పెట్టడం మంచిది.


